గ్రామీణ మహిళలు ఆర్థికంగా ఎదుగుదల కోసం తెలంగాణ ప్రభుత్వం ‘ఇందిరా మహిళా శక్తి పథకం’ను విస్తృతంగా అమలు చేస్తోంది. ఈ కార్యక్రమం ఉపాధి కల్పనకే పరిమితం కాకుండా.. మహిళలను నిజమైన పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే దిశగా ముందుకు సాగుతోంది. పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా రుణాలు అందించడంతోపాటు.. మహిళల కోసం క్యాంటీన్లు, డెయిరీ పార్లర్లు, సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంకుల నిర్వహణ వంటి విభిన్న అవకాశాలను కల్పిస్తోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది.
స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు రుణాలు ఇప్పించి.. వాటి ద్వారా ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేయించే ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ బస్సులను ఆర్టీసీకి అద్దెకు ఇవ్వడం ద్వారా మహిళలకు ఒక స్థిరమైన ఆదాయ మార్గం ఏర్పడుతుంది. ఫలితంగా బస్సుల కొరత సమస్య కూడా కొంత మేరకు పరిష్కారమవుతుంది. సంగారెడ్డి జిల్లాలోని మూడు డిపోల పరిధిలో ప్రస్తుతం 260 బస్సులు నడుస్తుండగా.. మహిళా సంఘాల బస్సులు చేరికతో ఆ సంఖ్య మరింత పెరగనుంది.
మహిళలకు లభించే ఆర్థిక ప్రయోజనాలు..
ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 695 గ్రామీణ సంఘాలు పనిచేస్తున్నాయి. వాటిలో 25 సమాఖ్య సంఘాలు ఉండగా.. ఒక లక్ష 95 వేలకుపైగా మహిళా సభ్యులు ఉన్నారు. ప్రభుత్వం రూ.30 లక్షల ఆర్థిక సహాయం అందిస్తే.. మహిళా సంఘాలు రూ.6 లక్షలు జోడించి బస్సు కొనుగోలు చేసే అవకాశం కలుగుతుంది. ఈ బస్సుల ద్వారా నెలకు సుమారు రూ.60 నుండి రూ.70 వేల వరకు నికర ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ విధానం ద్వారా మహిళలు ఆర్థికంగా బలపడే అవకాశం ఉంటుంది.
తెలంగాణలో అమలు అవుతున్న మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు. దీంతో వీరికి పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తుండగా.. వీటిలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. దీనివల్ల ఆర్టీసీకి అదనపు వాహనాలు అవసరం ఏర్పడింది. కొత్తగా బస్సులను కొనుగోలు చేయడం ఆర్థిక భారంగా మారడంతో.. మహిళా సంఘాల అద్దె బస్సులను వినియోగించడం రెండు వర్గాలకూ లాభదాయకంగా మారుతుంది. ప్రైవేట్ ఆపరేటర్లపై ఆధారపడకుండా మహిళల ఆధ్వర్యంలో నడిచే బస్సులు వాడటం ద్వారా ఆర్టీసీకి నమ్మదగిన వనరులు లభిస్తాయి.
ఈ కొత్త అవకాశాలు మహిళలకు ఒకవైపు ఉపాధిని, మరోవైపు ఆత్మవిశ్వాసాన్ని అందిస్తున్నాయి. ఇప్పటివరకు గృహకార్యాల్లో మాత్రమే నిమగ్నమైన అనేక మహిళలు ఇప్పుడు స్వతంత్ర వ్యాపారవేత్తలుగా మారుతున్నారు. ఒక సంఘం కృషి వందలాది కుటుంబాల జీవితాలను మార్చగలదని ఈ పథకం స్పష్టంగా చూపిస్తోంది. జిల్లాకు త్వరలో మరిన్ని బస్సులు మంజూరుకానున్నాయి. ఈ బస్సులు రవాణా సౌకర్యాన్ని పెంచడమే కాకుండా.. మహిళలకు స్థిరమైన ఆర్థిక భద్రతను కల్పిస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సాధికారతను ప్రోత్సహిస్తూ.. ఆర్థిక స్వావలంబనకు దారి తీస్తున్న ఈ పథకం రాష్ట్రంలోనే కాకుండా దేశానికి ఒక ఆదర్శంగా నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa