గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అక్రమాలు జరిగాయంటూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. అప్పటి సీఎం కేసీఆర్, నీటి పారుదలశాఖ మంత్రి హరీష్, ఆర్థిక మంత్రి ఈటల, ఇతర అధికారుల పాత్ర ఉందని దాదాపు రూ.లక్ష కోట్ల స్కాం జరిగినట్లు సీఎం రేవంత్ ఆరోపించారు. ఈ మేరకు విశ్రాంత న్యాయమార్తి పీసీ ఘోష్ ఛైర్మన్‌గా ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటుగా చేయగా నివేదిక ప్రభుత్వానికి అందింది. ఆ నివేదికపై ఇటీవల తెలంగాణ అసెంబ్లీలో చర్చ అనంతరం.. కాళేశ్వరం అవినీతి కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2022లో తెలంగాణలోకి సీబీఐ ని నిషేధిస్తూ ఉత్తర్వులు ఇవ్వగా.. దాన్ని తాజాగా సడలించారు. ఈ మేరకు కాళేశ్వరం అక్రమాల్లో పాలు పంచుకున్న ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంట్రాక్టర్లపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సీబీఐకి లేఖ రాస్తూ జీవో విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు విషయంలో ఎదురవుతున్న సాంకేతిక, చట్టపరమైన అంశాలను మాజీ సీబీఐ జేడీ వీవీ లక్ష్మీనారాయణ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇందులో భాగస్వాములైనప్పుడు వారిపై దర్యాప్తు చేయడానికి సీబీఐకి నేరుగా అధికారం ఉండదని ఆయన స్పష్టం చేశారు. సీబీఐ విచారణకు కేవలం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే సరిపోదని.. కేంద్ర ప్రభుత్వం అనుమతి కూడా తప్పనిసరి అని తెలిపారు.
'రాష్ట్రంలో ఒక కేసును సీబీఐ దర్యాప్తు చేయాలంటే ముందుగా రాష్ట్ర ప్రభుత్వం దిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ (DSPE) చట్టం సెక్షన్ 6 కింద ఒక నోటిఫికేషన్ జారీ చేసి, సీబీఐ దర్యాప్తుకు తన అనుమతిని ఇవ్వాలి. ఇది సాధారణంగా 'జనరల్ కన్సెంట్' లేదా 'స్పెసిఫిక్ కన్సెంట్' రూపంలో ఉంటుంది. రాష్ట్రం అనుమతి ఇచ్చిన తర్వాత, సీబీఐ దర్యాప్తును ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం సెక్షన్ 5 కింద మరో నోటిఫికేషన్ జారీ చేయాలి. ఈ ప్రక్రియ పూర్తయితేనే సీబీఐ దర్యాప్తు అధికారం పొందుతుంది.' అని జేడీ వివరించారు.
జేడీ లక్ష్మీనారాయణ చెప్పిన దాని ప్రకారం.. కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో అవినీతి ఆరోపణలు ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులపై ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తన అధికారంతో సీబీఐని విచారణకు కోరినప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి రావడం కూడా కీలకం. ఎందుకంటే దర్యాప్తు అధికారం కేంద్రం చేతుల్లో ఉంటుంది. ఒకవేళ ఏ రాష్ట్రమైనా 'జనరల్ కన్సెంట్' వెనక్కి తీసుకుంటే ఆ రాష్ట్రంలో కొత్త కేసులపై సీబీఐ దర్యాప్తు చేయడానికి వీలు ఉండదు.
లక్ష్మీనారాయణ చెప్పినట్లు.. రాష్ట్ర ప్రభుత్వం సెక్షన్ 6 కింద నోటిఫికేషన్ జారీ చేసి, కేంద్ర ప్రభుత్వం సెక్షన్ 5 కింద అంగీకరిస్తేనే సీబీఐ దర్యాప్తు సాధ్యమవుతుంది. కేవలం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంటే చట్టపరంగా సరిపోదు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సెక్షన్ 6 కింద జీవో జారీ చేయగా.. కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ కేసులో సీబీఐ విచారణ కొనసాగే ఛాన్స్ ఉంటుంది. ఇక ఈ వ్యవహారంలో పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా కేసీఆర్, హరీష్ రావులపై చర్యలు తీసుకోవద్దంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో కాళేశ్వరం కేసులో చట్టపరమైన అంశాలు మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa