తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ .. గ్రూప్-2 పోస్టుల తుది ఫలితాల వెల్లడికి కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేయగా.. అభ్యర్థుల అర్హతలు, ఇచ్చిన ఆప్షన్లు సహా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని ఫైనల్ లిస్ట్‌ను తయారు చేసేందుకు సిద్ధం అవుతోంది. ఇప్పటికే ప్రక్రియ అంతా పూర్తి కాగా.. 3 నెలల క్రితమే ఫలితాలు వెలువరించాలని భావించినా.. గ్రూప్-1 పరీక్ష ఫలితాలపై అభ్యర్థులు కేసులు వేయడం, కోర్టుల్లో న్యాయ ప్రక్రియ కారణంగా గ్రూప్-2 ఫలితాలు కూడా ఆలస్యం అయ్యాయి. మరోవైపు.. గ్రూప్-1, గ్రూప్-2 రిజల్ట్స్ కారణంగా గ్రూప్-3 ఫలితాల వెల్లడి కూడా మరింత ఆలస్యం అవుతోంది.
తెలంగాణలో 783 పోస్టులతో గ్రూప్-2 నోటిఫికేషన్‌ను అప్పటి 2022లో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ సర్కార్ హయాంలో టీజీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ గ్రూప్-2 ఉద్యోగాల కోసం తెలంగాణలో మొత్తం 5,51,855 మంది దరఖాస్తులు చేశారు.. 2024 డిసెంబరులో గ్రూప్-2కు రాత పరీక్షలను టీజీపీఎస్సీ నిర్వహించగా.. కేవలం 2,49,964 మంది మాత్రమే హాజరయ్యారు. ఇక ఓఎంఆర్ పత్రాల్లో తప్పుల్లో, సరిగా బబ్లింగ్ చేయకపోవడం వంటి కారణాలతో మరో 13,315 మంది అభ్యర్థులను టీజీపీఎస్సీ అనర్హులుగా ప్రకటించింది.
ఈ క్రమంలోనే మిగతా 2,36,649 మందికి.. మార్కులతో కూడిన జనరల్ ర్యాంక్ లిస్ట్‌ను ఈ ఏడాది మార్చి 11వ తేదీన టీజీపీఎస్సీ రిలీజ్ చేసింది. 1:1 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి 3 దశల్లో సర్టిఫికెట్ల పరిశీలనను పూర్తి చేసింది. మొదటి 2 విడతల్లో వెరిఫికేషన్ పూర్తి అయిన తర్వాత సరైన అభ్యర్థులు అందుబాటులో లేక మిగిలిన పోస్టులకు.. మెరిట్ జాబితా నుంచి మూడో దశలో మరోసారి పరిశీలనకు పిలిచింది. వీరికి ఈనెల 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు పరిశీలన నిర్వహించింది. మరోవైపు.. నోటిఫికేషన్‌లోని కొన్ని పోస్ట్‌లకు అవసరమైన మెడికల్ టెస్ట్‌లు కూడా పూర్తి చేశాయి.
మరోవైపు.. 1,388 పోస్టులతో విడుదల చేసిన గ్రూప్-3 నోటిఫికేషన్‌కు 2024 నవంబర్‌లో రాతపరీక్షలు టీజీపీఎస్సీ నిర్వహించింది. ఈ పరీక్షలకు మొత్తం 2,67,921 మంది హాజరు కాగా.. టెక్నికల్ మిస్టేక్స్ చేసిన 18,364 మందిని అనర్హులుగా ప్రకటించిన టీజీపీఎస్సీ.. మిగిలిన 2,49,557 మంది అభ్యర్థులతో జనరల్ ర్యాంక్ లిస్ట్‌ను ఈ ఏడాది మార్చి 14వ తేదీన విడుదల చేసింది. మెరిట్ జాబితాలో ఉన్న అభ్యర్థులకు.. ఈ జూన్‌లోనే సర్టిఫికెట్ల వెరిఫికే,న్ నిర్వహించాలని కమిషన్ షెడ్యూల్ కూడా ప్రకటించింది. అయితే అభ్యర్థుల నుంచి వచ్చిన వినతుల కారణంగా ఈ ధ్రువపత్రాల పరిశీలనను వాయిదా వేసింది. గ్రూప్-2 ఫైనల్ రిజల్ట్ వెల్లడికి ప్రభుత్వం తరఫున జరగాల్సిన ప్రక్రియ పూర్తి అయిన తర్వాత గ్రూప్-3 అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించాలని టీజీపీఎస్సీ యోచిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa