తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం వేగంగా ముందుకు సాగుతోంది. అర్హులైన పేదలందరికీ సొంత ఇంటి కల నిజం చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటివరకు రూ. 1,612.37 కోట్లను లబ్ధిదారులకు విడుదల చేసినట్లు హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. ఈ నిధుల విడుదలతో ఇంటి నిర్మాణ పనులు మరింత వేగవంతం కానున్నాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఒక్కో లబ్ధిదారుడికి ఇంటి నిర్మాణానికి మొత్తం రూ. 5 లక్షలు ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా ఇంటి నిర్మాణ దశలను బట్టి విడతల వారీగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నారు. ఈ పారదర్శక విధానం వల్ల నిధులు సకాలంలో అవసరమైన వారికి చేరుతున్నాయని, పథకం దుర్వినియోగం కాకుండా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
అయితే, కొన్ని చోట్ల లబ్ధిదారులకు నిధులు జమకాకపోవడంపై ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ సమస్యపై హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతమ్ స్పందిస్తూ, బిల్లులు జమకాని లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. చాలా సందర్భాల్లో బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్ అనుసంధానం కాకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతోందని ఆయన వివరించారు.
కాబట్టి, నిధులు అందని లబ్ధిదారులు వెంటనే తమ బ్యాంకుకు వెళ్లి తమ ఆధార్ నెంబర్‌ను ఖాతాతో అనుసంధానం చేసుకోవాలని గౌతమ్ సూచించారు. ఈ చిన్న ప్రక్రియ పూర్తి చేయడం ద్వారా వెంటనే నిధులు వారి ఖాతాలో జమ అవుతాయని ఆయన భరోసా ఇచ్చారు. ప్రభుత్వ లక్ష్యం పేదలందరికీ సొంత ఇంటిని కట్టించడం కాబట్టి, లబ్ధిదారులు అధికారుల సూచనలను పాటించి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa