తెలంగాణ రాష్ట్రంలో.. ముఖ్యంగా మెదక్ జిల్లాలో వరి రైతులు ఈ వానాకాలం సీజన్‌లో సన్న రకాల సాగుపై అధిక ఆసక్తి కనబరిచారు. రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించడంతో.. సాధారణ ధర కంటే ఎక్కువ ఆదాయం పొందవచ్చనే ఉద్దేశంతో అనేకమంది రైతులు ఈ రకాల నాట్లకు ముందుకు వచ్చారు.
సన్నాల సాగుకు పెరుగుతున్న మొగ్గు..
ఈ ఏడాది మెదక్ ప్రాంతంలో సన్న వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. గతంలో సుమారు 48 వేల ఎకరాలలో మాత్రమే సాగు చేసిన రైతులు, ప్రస్తుత సీజన్‌లో దాదాపు రెట్టింపు అంటే 96,343 ఎకరాలకు విస్తరించారు. జిల్లాలో మొత్తం వరి సాగు విస్తీర్ణం 2,96,531 ఎకరాలుగా నమోదైంది. నాణ్యత విషయంలో సన్నాలు ఉత్తమమైనవి. సాధారణంగా వడ్లను మర పట్టించినప్పుడు తక్కువగా నూకలు పోవడం, మంచి రుచి ఉండటం వలన రైతులు తమ ఇంటి అవసరాల కోసం కూడా ఈ రకాలను పండిస్తుంటారు.
ప్రస్తుతం చాలా చోట్ల పంట పొట్ట దశకు చేరుకుని.. గింజలు పాలు పోసుకునే దశలో ఉంది. ఈసారి వర్షాలు సమృద్ధిగా కురవడంతో పంట దిగుబడి ఆశాజనకంగా ఉంటుందని రైతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చీడపీడల బెడద ఉన్నా, సరైన నివారణ పద్ధతులు పాటిస్తే ప్రతి ఎకరం నుండి 20 నుంచి 25 క్వింటాళ్ల వరకు దిగుబడిని ఆశించవచ్చు.
రైతులకు ఆర్థిక ప్రయోజనం
ఈ సీజన్‌లో మెదక్ రైతులు మొత్తం 25 లక్షల క్వింటాళ్ల సన్నాల దిగుబడిని సాధిస్తారని అంచనా వేస్తున్నారు నిపుణులు. ప్రభుత్వం మద్దతు ధరతో పాటు క్వింటాలుకు రూ. 500 చొప్పున అదనంగా బోనస్ ఇస్తుండటం రైతులకు పెద్ద ఊరట. దీని ద్వారా జిల్లా రైతులకు అదనంగా రూ. 125 కోట్లు లభించనున్నాయి. ఒక్కో రైతు సరాసరి రెండెకరాల్లో ఈ పంట వేసినా.. సుమారు రూ. 25,000 వరకు అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంది.
ప్రభుత్వం ఏ-గ్రేడ్ వరికి క్వింటాలుకు రూ. 2,389, సాధారణ రకానికి రూ. 2,369 మద్దతు ధర ప్రకటించింది. ఈ ధరలకు అదనంగా బోనస్ అందజేయడం వలన ఆర్థికంగా వెనుకబడిన రైతాంగానికి ధైర్యం వచ్చినట్లయింది. అయితే.. గత రబీ సీజన్‌లో పండించిన సన్నాలకు ఇప్పటికీ బోనస్ బకాయిలు చెల్లించకపోవడం కొంతమంది రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. గత అనుభవం పునరావృతం కాకుండా.. అధికారులు వెంటనే ప్రత్యేక కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, సన్నాలను సేకరించి, బోనస్ చెల్లింపుల విషయంలో వేగంగా స్పందించాలని రైతులు కోరుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa