ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేవలం రూ.2 లక్షల బడ్జెట్‌తో.. 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో లగ్జరీ ఇల్లు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 18, 2025, 07:06 PM

భవన నిర్మాణ రంగంలో నూతన ఆవిష్కరణలు విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతున్నాయి. గతంలో ఇనుము, ఇసుక, కంకర, సిమెంట్ వంటి సామగ్రితో బీమ్స్, స్లాబ్‌లతో కూడిన కాంక్రీట్ నిర్మాణాలకు సంవత్సరాల సమయం పట్టేది. ఇప్పుడు ప్రీ-ఫ్యాబ్రికేటెడ్ స్టీల్ విధానం ద్వారా ఆ సమయం తగ్గింది. తాజాగా.. త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ సొంతింటి కలను మరింత వేగంగా.. తక్కువ వ్యయంతో సాకారం చేసే సరికొత్త యుగాన్ని తీసుకొచ్చింది. ఈ సాంకేతిక పరిజ్ఞానంతో కేవలం 45 రోజుల కాలవ్యవధిలోనే అందమైన నివాసాలను నిర్మించడం సాధ్యమవుతోంది.


3డీ ప్రింటింగ్ ఇళ్ల ప్రత్యేకతలు..


సాధారణ గృహ నిర్మాణంతో పోలిస్తే.. 3డీ ప్రింటింగ్ ఇళ్లలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఇవి తక్కువ వనరులు, తక్కువ శ్రమతో నాణ్యతను అందిస్తున్నాయి. 3డీ ప్రింటింగ్ నిర్మాణంలో కంకరను వాడరు. పిల్లర్లు కూడా అవసరం లేదు. ఇంటికి గోడలను నిర్మాణ బ్లాక్‌ల రూపంలో ఉపయోగిస్తారు. ఈ బ్లాక్‌లను ప్రధానంగా ఫ్లైయాష్, సిమెంట్ తక్కువ మోతాదులో ఇసుకతో తయారుచేస్తారు. సాంప్రదాయ నిర్మాణంతో పోలిస్తే.. 3డీ ఇంటికి సగం సిమెంట్ మాత్రమే అవసరమవుతుంది. ఉదాహరణకు.. పది అడుగుల ఎత్తు గోడను నిర్మించాలంటే.. మూడు అడుగుల చొప్పున మూడు బ్లాక్‌లను, ఒక అడుగు బ్లాక్‌ను రూపొందించి.. వాటిని బేస్ మెంట్ పై అమర్చుతారు.


 ఈ బ్లాక్‌లను భారీ యంత్రాల సాయంతో ప్రింట్ చేసి, నిర్మాణ స్థలానికి తరలించి.. ఒకదానిపై ఒకటి పేర్చుతారు. వాటిని బలంగా అతికించడానికి ‘మర్ ఫర్’ అనే ప్రత్యేక పదార్థాన్ని ఉపయోగిస్తారు. స్లాబ్ వేయడానికి మాత్రమే ఇనుము, ఉక్కును వాడతారు. కూలీల కొరత, నిర్మాణ సామాగ్రి ధరలు పెరిగిపోవడంతో ఇల్లు కట్టుకోవాలనే ఆశయం గగనం అవుతున్న ఈ తరుణంలో.. త్రీడీ ప్రింటింగ్ ఒక వరంగా మారింది. నిర్మాణ రంగ నిపుణుల అంచనా ప్రకారం.. కేవలం రూ. 2 లక్షల బడ్జెట్‌తో 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో లగ్జరీ తరహా ఇల్లు నిర్మించుకోవచ్చు.


ఈ ఇళ్లల్లో హాల్, సింగిల్ బెడ్ రూమ్, కిచెన్, బాత్‌రూమ్ వంటి సదుపాయాలు ఉంటాయి. ఈ నిర్మాణ పద్ధతిని ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద తక్కువ ధరకే నాణ్యమైన నివాసాలను అందించడానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది. త్రీడీ ఇళ్ల వల్ల కాలంతో పాటు చెక్కుచెదరని నిర్మాణం లభిస్తుంది. దీనితో పాటు పర్యావపరంగా కూడా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ గృహాలు సాధారణ ఇళ్ల కంటే తక్కువ మోతాదులో కార్బన్ డయాక్సైడ్‌ను విడుదల చేస్తాయి. ఈ నివాసాల ఉష్ణోగ్రత సాధారణ భవనాల కంటే పది డిగ్రీలు తక్కువగా ఉండటం వల్ల.. వేసవి కాలంలోనూ లోపల చల్లగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాలలోని గ్రామీణ ప్రజానీకానికి కూడా అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa