మద్యం తాగి ఆటో నడిపి డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన ఓ ఆటోడ్రైవర్... పోలీస్ స్టేషన్ వద్ద పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటల్లో కాలిపోతున్న అతడ్ని పోలీసులు, స్థానికులు రక్షించేందుకు ప్రయత్నించారు. మంటల ఆర్పి ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే అతడు మృతిచెందాడు. ఈ ఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో నవంబరు 4 మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం రాత్రి కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తుండగా.. దుమ్మాయిగూడకు చెందిన సింగిరెడ్డి మీన్‌రెడ్డి (32) అనే ఆటో డ్రైవర్ మద్యం మత్తులో బండి నడుపుతూ చిక్కాడు. అతడికి బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ నిర్వహించగా.. రీడింగ్ 120 వచ్చింది. దీంతో మీన్రెడ్డిపై కేసు నమోదు చేసిన ట్రాఫిక్ పోలీసులు ఆటోను స్వాధీనం చేసుకున్నారు.
అయితే, అర్ధరాత్రి ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ వద్ద పెట్రోల్ పోసుకుని అతడు నిప్పంటించుకున్నాడు. గమనించి పోలీసులు, స్థానికులు వెంటనే స్పందించి మంటలు ఆర్పి కాపాడేందుకు ప్రయత్నించారు. అనంతరం చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మీన్‌రెడ్డి మృతిచెందాడు. అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. అయితే, అతడి కుటుంబసభ్యులు మాత్రం పోలీసులపై ఆరోపణలు చేశారు. పోలీసులు దురుసుగా ప్రవర్తించడం వల్లే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకున్నాడని వారు ఆరోపిస్తున్నారు. అయితే, మద్యం తాగి వాహనాలు నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని, డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడితే జైలు శిక్ష తప్పదని పోలీసులు హెచ్చరికలు చేసినా కొందరు మాత్రం పెడనచెవినపెడుతున్నారు.
కాగా, గతంలోనూ ఇటువంటి సంఘటన జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఈ ఏడాది జులైలో నల్లగొండలో ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ వద్దే ఆత్మహత్యాయత్నం చేశాడు. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. నల్లగొండ పట్టణానికి చెందిన రావిళ్ల నర్సింహా అనే వ్యక్తి డ్రంకెన్ డ్రైవ్‌లో చిక్కాడు. దీంతో అతడి బైక్‌ను పక్కన పెట్టించి పోలీసులు అక్కడి నుంచి పంపించారు. అర్ధరాత్రి ఒంటిపై పెట్రోల్ పోసుకుని స్టేషన్‌కు వచ్చిన అతడు ‘నాపైనే కేసు పెడతారా’ అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. అనంతరం లైటర్‌తో నిప్పంటించుకున్నాడు. వెంటనే అక్కడ ఉన్న పోలీసులు దుప్పటి కప్పి మంటలు ఆర్పాడు. ఈ క్రమంలో ఓ హోంగార్డు కూడా గాయపడ్డాడు. పోలీసులు తక్షణమే స్పందించడంతో అతడికి ప్రాణపాయం తప్పింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa