రైతు అంటే కేవలం పంట పండించేవాడు కాదు.. భూమిని నమ్ముకొని, ఆరుగాలం ప్రకృతితో పోరాడే సాహసికుడు. విత్తనం నాటిన రోజు మొదలు, ఆకాశం వైపు చూసే ప్రతి చూపులోనూ ఆశ, ఆందోళన కలగలిసి ఉంటాయి. ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ, పురుగు పట్టకుండా రాత్రింబవళ్ళు కంటికి రెప్పలా పంటను కాపాడుకుంటాడు. తన చెమట చుక్కలతో నేలను తడిపి, ఆ కష్టాన్ని పంటగా చూసుకుంటాడు. పత్తి పంట పండించడంలోనూ రైతు పడే శ్రమ అంతా ఇంతా కాదు. తెల్లబడిన పత్తిని చేతులతో ఏరి, బస్తాల కొద్దీ కుప్పలు పోసి.. దాన్ని మార్కెట్‌కు చేర్చేవరకు ఎన్నో ఆటంకాలు. ఆరు నెలల కృషి తర్వాత ఇంటికి తీసుకెళ్లాల్సిన ఆ పంటనే అపహరణకు గురైతే ఆ రైతు గుండె ఎంత తల్లడిల్లుతుందో ఊహించగలం.
రైతుల కష్టాన్ని దోచుకునే దొంగల అరాచకాలు రంగారెడ్డి జిల్లా, మాడ్గుల మండల కేంద్రంలో వెలుగు చూశాయి. రైతులు తమ పొలాల్లో నిల్వ ఉంచిన పత్తిని రాత్రికి రాత్రే దొంగలు అపహరించుకుపోతున్నారు. ఈ వరుస దొంగతనాలు మాడ్గుల ప్రాంత రైతులను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం ఇద్దరు రైతుల పొలాల నుంచి సుమారు మూడు క్వింటాళ్ల పత్తిని దొంగలు ఎత్తుకెళ్లారు. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా.. దొంగలు పట్టుబడకపోవడంతో రైతులు నిస్సహాయత వ్యక్తం చేశారు. తాజా సంఘటనగా.. శుక్రవారం రాత్రి ఒక రైతు పొలం నుంచి ఏకంగా 8 క్వింటాళ్ల పత్తిని దొంగిలించారు.
మరోసారి దొంగతనం జరగడంతో బాధిత రైతులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే.. పోలీసులు నామమాత్రపు తనిఖీలు మాత్రమే చేస్తున్నారని, కేసు దర్యాప్తులో వేగం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట, మార్కెట్‌కు తరలించడానికి సిద్ధంగా ఉన్న సమయంలో చోరీకి గురవడం రైతులను తీవ్రంగా కలచివేసింది.
దీనిపై మండల రైతాంగం పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తోంది. పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని.. దొంగలను త్వరగా పట్టుకోవాలని, రైతులకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. పత్తి పంటపై ఆధారపడి కుటుంబ పోషణ సాగించే ఈ రైతులకు తక్షణమే న్యాయం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపై ఉంది. ఈ వరుస చోరీల నేపథ్యంలో పోలీసులు రాత్రి వేళల్లో పెట్రోలింగ్ పెంచి.. రైతుల ఆస్తులకు భద్రత కల్పించాలని మండల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa