సినీ పరిశ్రమకు భారీ నష్టాన్ని కలిగించిన హై-లెవల్ హెచ్‌డీ మూవీ పైరసీ కేసులో ప్రధాన నిందితుడు. ఐ బొమ్మ నిర్వహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేయడంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సాధించిన విజయాన్ని సీనియర్ ఐపీఎస్ అధికారి, నగర పోలీస్ మాజీ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రశంసించారు. పోలీసులకే బహిరంగ సవాలు విసిరిన నిందితుడిని ఎట్టకేలకు పట్టుకోవడంపై ఆయన ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు.
'దమ్ముంటే పట్టుకోండి నన్ను' అని పోలీసులను సవాల్ చేసిన వ్యక్తిని సైబర్ క్రైమ్ డీసీపీ కవిత నేతృత్వంలోని హైదరాబాద్ పోలీస్ బృందం అరెస్ట్ చేయడం అభినందనీయమన్నారు. డిజిటల్ కంపెనీల సర్వర్లను హ్యాక్ చేసి, సినిమా విడుదల కంటే ముందే ఒరిజినల్ హెచ్‌డీ కాపీలను వెబ్‌సైట్లలో విడుదల చేసి, సినీ పరిశ్రమకు భారీ నష్టాన్ని కలిగించిన ఈ హై-లెవల్ పైరసీ కేసు వివరాలను గతంలో తాను ప్రెస్ మీట్ ద్వారా వెల్లడించినట్లు తెలిపారు.
'సైబర్ క్రైమ్ బృందం జూన్ 5 నుంచి రాత్రింబవళ్లు శ్రమించి విదేశాల్లో ఉన్న ఈ రవి మినహా మిగిలిన ముఖ్య నిందితులందరినీ అరెస్ట్ చేసింది. తాజాగా రవిని కూడా అరెస్టు చేశారు. పోలీసులకే సవాల్ విసిరిన రవిని అరెస్టు చేసినందుకు.. అద్భుతమైన పనితీరు కనబరిచిన డీసీపీ సైబర్ క్రైమ్ హైదరాబాద్, సిటీ పోలీస్, కమిషనర్ సజ్జనార్‌లకు నా శుభాకాంక్షలు' అని సీవీ ఆనంద్ ట్వీట్ చేశారు.
కాగా, నిందితుడు ఇమ్మడి రవి సినిమా విడుదల కాకముందే డిజిటల్ కంపెనీల సర్వర్లను హ్యాక్ చేసి, ఒరిజినల్ హెచ్‌డీ కాపీలను తమ ఐ బొమ్మ వెబ్‌సైట్ల విడుదల చేయడం ద్వారా సినీ పరిశ్రమకు కోట్లాది రూపాయల నష్టాన్ని కలిగించాడు. ఈ పైరసీ ముఠా కార్యకలాపాలను గుర్తించిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు జూన్ 5వ తేదీ నుంచే లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. ఈ హ్యాకర్లు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి, కంటెంట్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ల (CDN) సర్వర్‌లను లక్ష్యంగా చేసుకున్నారు. కొత్త సినిమా ప్రివ్యూలు లేదా డిజిటల్ రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న ఫైళ్లను తస్కరించి, కొన్ని గంటల్లోనే హెచ్‌డీ నాణ్యతతో ఆన్‌లైన్‌లో ఉంచేవారు. కరీబియన్ దీవుల నుంచి ఈ ఫైరసీలు చేసేవాడు.
విదేశాల్లో ఉంటూనే పోలీసుల దర్యాప్తును చూసి, రవి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ పోలీసులకు సవాల్ విసిరాడు. 'నన్ను పట్టుకునే దమ్ము మీకు లేదు' అంటూ ఛాలెంజ్ విసిరాడు. ఈ ఛాలెంజ్‌ను హైదరాబాద్ పోలీసులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ ఆదేశాల మేరకు, డీసీపీ కవిత బృందం అతడి కదలికలను ట్రాక్ చేసింది. అతడి లొకేషన్, ఐపీ అడ్రస్‌ల ఆధారంగా పూర్తి సమాచారాన్ని సేకరించింది. చివరగా.. రవితో విభేదాల కారణంగా భార్య దూరంగా ఉంటుండగా ఆమె ఇచ్చిన సమాచారంతో ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ఐ బొమ్మ, బొప్పమ్ టీవీ వెబ్‌సైట్లను బ్లాక్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa