ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రియదర్శి జూరాల ప్రాజెక్టు డ్యాం దిగువన,,,, హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి శుంకుస్థాపన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 01, 2025, 07:47 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం వనపర్తి జిల్లాలో పర్యటించారు. మక్తల్ నియోజకవర్గంలోని ఆత్మకూరు (ఎం) , అమరచింత మున్సిపాలిటీల పరిధిలో ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండే మొత్తం రూ.151.92 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ పనులలో అత్యంత కీలకమైనది, ప్రియదర్శి జూరాల ప్రాజెక్టు డ్యాం దిగువన నిర్మించనున్న హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం. ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన పనులలో హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రియదర్శి జూరాల ప్రాజెక్టు డ్యాం దిగువన ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం రూ. 121.92 కోట్లను కేటాయించారు.


ఈ భారీ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే.. వనపర్తి జిల్లాలోని మక్తల్ నియోజకవర్గంతో పాటు మహబూబ్‌నగర్, కర్ణాటకలోని సరిహద్దు ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. వరదలు వచ్చినప్పుడు లేదా జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసినప్పుడు రాకపోకలకు అంతరాయం లేకుండా ఈ బ్రిడ్జి ఉపయోగపడుతుంది. ఇది స్థానిక ప్రజల కష్టాలను తీర్చడమే కాకుండా.. ఆ ప్రాంత ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేస్తుంది.


బ్రిడ్జి నిర్మాణంతో పాటు.. ముఖ్యమంత్రి పట్టణాల్లో ప్రజలకు అత్యవసరమైన ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాల కల్పనకు కూడా శ్రీకారం చుట్టారు. ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో రూ.15 కోట్ల వ్యయంతో మౌలిక వసతులు, వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగింది. వీటితో పాటు.. ఆత్మకూరు మున్సిపాలిటీలో ప్రజల ఆరోగ్య అవసరాల కోసం 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మాణానికి కూడా సీఎం శంకుస్థాపన చేశారు.


అమరచింత మున్సిపాలిటీ పరిధిలో కూడా రూ.15 కోట్లతో మౌలిక వసతులు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టడానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు స్థానిక మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈ అభివృద్ధి పనులు వనపర్తి జిల్లా రూపురేఖలను మార్చి.. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa