భాగ్యనగర పాలనలో ఒక కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వార్డుల పునర్విభజన ప్రక్రియకు ఎట్టకేలకు న్యాయపరమైన చిక్కులు తొలిగిపోయాయి. నగర విస్తీర్ణం, పెరిగిన జనాభాకు అనుగుణంగా వార్డుల సంఖ్యను పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయం అమలుకు సిద్ధమైంది. దీనికి సంబంధించిన తుది అధికారిక ప్రకటన వెలువడడమే తరువాయి. నగర ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ఈ భారీ కసరత్తు సాగుతోంది.
వార్డుల విభజనపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన ఉన్నత న్యాయస్థానం.. ఈ ప్రక్రియను ఆపాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ప్రాథమిక ప్రకటన విడుదల చేసిన తర్వాత ప్రజల నుంచి దాదాపు 5,905 అభ్యంతరాలు , సూచనలు అందాయి. ముఖ్యంగా జనాభా లెక్కలు, మ్యాపుల విషయంలో స్పష్టత కోరిన వారికి అవసరమైన వివరాలు అందజేయాలని అధికారులను కోర్టు ఆదేశించింది. దీంతో పాలనాపరమైన అడ్డంకులు తొలగి.. తుది నిర్ణయానికి మార్గం సుగమమైంది.
ఈ విభజన ప్రక్రియలో అధికారులు అత్యంత శాస్త్రీయ పద్ధతులను అనుసరించారు. 2011 జనాభా లెక్కలు, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ దగ్గర ఉన్న తాజా గణాంకాలను పరిగణనలోకి తీసుకున్నారు. ప్రతి వార్డులో సగటున 45 వేల మంది జనాభా ఉండేలా ప్రణాళిక రూపొందించారు. దీనికి పది శాతం అటు ఇటుగా మార్పులు చేసే వెసులుబాటు కల్పించారు. ప్రస్తుతం ఉన్న 150 వార్డుల సంఖ్యను 300కు పెంచడం వల్ల ప్రతి ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించే అవకాశం కలుగుతుంది. వార్డుల సంఖ్య ఖరారైన వెంటనే ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కీలక పనులు ప్రారంభం కానున్నాయి. కొత్తగా ఏర్పాటైన వార్డుల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తారు.
జనాభా నిష్పత్తికి అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లను ఖరారు చేస్తారు. ఈ విషయంలో కూడా ప్రజల నుండి అభిప్రాయాలను సేకరించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటారు. అన్ని ప్రక్రియలు ముగిశాక, ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఎన్నికల ప్రక్రియ మొదలవుతుంది. అయితే.. 2027లో కేంద్రం చేపట్టబోయే జనాభా లెక్కల వరకు వేచి చూస్తారా లేక ముందే వెళ్తారా అన్నది వేచి చూడాలి.
వార్డుల పునర్విభజనలో పేర్ల మార్పుపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దశాబ్దాలుగా ఉన్న తమ ప్రాంతం పేరును మార్చడంపై స్థానికులు అభ్యంతరం తెలిపారు. ఈ సెంటిమెంట్‌ను గౌరవించిన ప్రభుత్వం, అధికారులు... విభజన తర్వాత కూడా వీలైనంత వరకు పాత పేర్లనే కొనసాగించాలని నిర్ణయించారు. దీనివల్ల ప్రజల గుర్తింపు చెక్కుచెదరకుండా ఉంటుంది. నగర పాలనలో వార్డుల సంఖ్య పెరగడం వల్ల నిధుల కేటాయింపులో, 'సమస్యల పరిష్కారంలో పారదర్శకత పెరుగుతుంది. గతంలో ఒక్కో కార్పొరేటర్ లక్షలాది మంది జనాభాకు ప్రాతినిధ్యం వహించాల్సి వచ్చేది.. దీనివల్ల క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారం కావడం కష్టమయ్యేది. ఇప్పుడు వార్డు విస్తీర్ణం తగ్గడం వల్ల డ్రైనేజీ, తాగునీరు, వీధి దీపాల వంటి మౌలిక వసతులపై నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. ఇది రాజకీయ ప్రక్రియ మాత్రమే కాదు.. హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా మార్చే క్రమంలో ఒక అనివార్యమైన ముందడుగుగా చెప్పుకోవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa