ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ చేస్తూ కీలక నిర్ణయం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 06, 2026, 09:11 PM

తెలంగాణ శాసనసభ మంగళవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ, అభివృద్ధిలో భాగంగా జిల్లా కేంద్రమైన నల్లగొండను మున్సిపల్ కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ చేస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. ఈ చారిత్రాత్మక నిర్ణయంతో నల్లగొండ పట్టణ ముఖచిత్రం పూర్తిగా మారనుంది. నల్లగొండ పట్టణం శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఒక పట్టణాన్ని కార్పొరేషన్‌గా గుర్తించడానికి రూ. 20 కోట్ల వార్షిక ఆదాయం, 2 లక్షల జనాభా ప్రాతిపదికగా ఉంటుంది.


అయితే నల్లగొండ పట్టణం ఇప్పటికే రూ. 40 కోట్ల వార్షిక ఆదాయంతో పాటు 2.5 లక్షల జనాభాను కలిగి ఉండటంతో అప్‌గ్రేడ్ ప్రక్రియ సులభతరమైంది. ఒకప్పుడు కేవలం రూ. 10 వేల బడ్జెట్‌తో ప్రారంభమైన ఈ పట్టణం.. నేడు రియల్ ఎస్టేట్, వాణిజ్య రంగాల్లో దూసుకుపోతోంది. కార్పొరేషన్‌గా మారడం వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి నిధుల రాక పెరగడమే కాకుండా అధునాతన మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


ఇదే సమావేశంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తన నియోజకవర్గ సమస్యలను సభ దృష్టికి తెచ్చారు. నార్కట్‌పల్లి మండలంలోని అమ్మనబోల్ గ్రామాన్ని కొత్త మండల కేంద్రంగా ప్రకటించాలని, అలాగే నకిరేకల్ పట్టణాన్ని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది.


మరోవైపు, తెలంగాణ శాసనమండలి కార్యకలాపాలు ముగిశాయి. స్పీకర్ గుత్తా సుఖేందర్ రెడ్డి సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశాల్లో మున్సిపల్ సవరణ బిల్లుతో పాటు మరో కీలక నిర్ణయానికి మండలి ఆమోద ముద్ర వేసింది. తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ సేవలను గౌరవిస్తూ.. ఆయన కుమారుడికి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం కల్పించే బిల్లును డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టగా సభ్యులందరూ మద్దతు తెలిపారు. ఈ శాసనమండలి సమావేశాల్లో ఎమ్మెల్సీ కవిత చేసిన చివరి ప్రసంగం ఆసక్తి రేకెత్తించింది. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఆమె.. సభలో వీడ్కోలు ప్రసంగం చేశారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని స్పీకర్ గుత్తా సుఖేందర్ రెడ్డిని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa