తెలంగాణలోని ప్రధాన పట్టణాల్లో పరిపాలనను మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనాభా ఎక్కువగా ఉన్న పట్టణ ప్రాంతాల్లో ఇకపై అదనపు తహశీల్దార్లను నియమించనున్నట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. పెద్దపల్లి జిల్లా పర్యటనలో భాగంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఒకటిన్నర లక్షల నుండి రెండు లక్షల జనాభా ఉన్న పట్టణాలు అనేకం ఉన్నాయి. ఇంత భారీ జనాభాకు కేవలం ఒక్కరే తహశీల్దార్ ఉండటం వల్ల రెవెన్యూ సేవల్లో జాప్యం జరుగుతోందని ప్రభుత్వం గుర్తించింది.
భూముల సర్వేలు, ధరణి సమస్యలు, కుల ధ్రువీకరణ పత్రాలు, ఇతర ప్రభుత్వ పథకాల అమలులో జాప్యం జరగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రతిపాదనను త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదించనున్నారు. తద్వారా పట్టణాల్లో పనుల భారం తగ్గి, సామాన్యులకు త్వరగా సేవలు అందుతాయి. ప్రభుత్వం చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాల వల్లే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిందని, మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే జోరు కొనసాగుతుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
పెద్దపల్లి సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రతిపక్ష నేత కేటీఆర్ పైన కూడా ఘాటు విమర్శలు చేశారు. వరుస ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీని తిరస్కరిస్తున్నా.. మున్సిపల్ ఎన్నికల్లో గెలుస్తామని కేటీఆర్ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. సొంత కుటుంబంలోని ఆడబిడ్డకు న్యాయం చేయలేని వారు, రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తారని ప్రశ్నించారు.
గత ప్రభుత్వం కేవలం కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందని, పేదలకు ఇళ్లు కట్టాలనే ఆలోచన చేయలేదని విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం పంపిణీ వంటి పనులకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇతర పెండింగ్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని, త్వరలోనే శుభవార్త వింటారని భరోసా ఇచ్చారు. పట్టణాల్లో ఇద్దరు ఎమ్మార్వోల నియామకం అనేది తెలంగాణ రెవెన్యూ వ్యవస్థలో ఒక విప్లవాత్మక మార్పుగా ఉండబోతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa