ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మలయాళం వర్సెస్ కన్నడ.. కేరళ కొత్త బిల్లుపై కర్ణాటక అసంతృప్తి

national |  Suryaa Desk  | Published : Sun, Jan 11, 2026, 09:02 PM

కేరళ ప్రభుత్వం ప్రతిపాదించిన మలయాళ భాషా బిల్లు 2025 పై పొరుగు రాష్ట్రం కర్ణాటక వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తోసిపుచ్చారు. ఈ బిల్లుపై వస్తున్న ఆందోళనలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని.. ఇది ఏ భాషను ఎవరిపై బలవంతంగా రుద్దే ప్రయత్నం కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ బిల్లుకు సంబంధించి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాసిన లేఖను ఎక్స్‌లో పోస్ట్ చేసిన పినరయి విజయన్.. దానిపై వస్తున్న ఆరోపణలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.


కర్ణాటక అభ్యంతరాలు ఏంటి?


కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ మలయాళ భాషా బిల్లు 2025పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఇటీవల లేఖ రాశారు. కాసరగోడ్ వంటి కేరళ-కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లోని కన్నడ మీడియం పాఠశాలల్లో కూడా మలయాళాన్ని మొదటి భాషగా తప్పనిసరి చేయడం భాషా స్వేచ్ఛను హరించడమేనని ఆ లేఖలో సిద్ధరామయ్య పేర్కొన్నారు. భాషా మైనారిటీల హక్కులను కాపాడేందుకు రాజ్యాంగపరంగా అందుబాటులో ఉన్న అన్ని మార్గాల్లో ఈ బిల్లును అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు.


పినరయి విజయన్ వివరణ


సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలపై స్పందించిన పినరయి విజయన్ సోషల్ మీడియా వేదికగా బిల్లులోని నిబంధనలను వివరించారు. కన్నడ, తమిళం మాట్లాడే ప్రజల హక్కులను కాపాడటానికి బిల్లులో స్పష్టమైన క్లాజులు ఉన్నాయని ఆయన తెలిపారు. నోటిఫైడ్ ప్రాంతాల్లోని ప్రజలు సెక్రటేరియట్ లేదా స్థానిక కార్యాలయాలకు కన్నడ లేదా తమిళ భాషల్లోనే దరఖాస్తులు పంపవచ్చని, ప్రభుత్వం కూడా అదే భాషలో సమాధానం ఇస్తుందని కేరళ ముఖ్యమంత్రి వివరించారు.


మలయాళం మాతృభాష కాని విద్యార్థులు నేషనల్ ఎడ్యుకేషన్ కరికులమ్ ప్రకారం తమకు నచ్చిన భాషను ఎంచుకోవచ్చని, ఇతర రాష్ట్రాల విద్యార్థులకు మలయాళ పరీక్షలు తప్పనిసరి కాదని పినరయి విజయన్ స్పష్టం చేశారు. కేరళ భాషా విధానం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 346, 347.. అధికార భాషా చట్టం 1963కి లోబడి ఉందని విజయన్ పేర్కొన్నారు. భారతదేశ వైవిధ్యాన్ని గౌరవించడం, ప్రతి పౌరుడి భాషా గుర్తింపును కాపాడటం తమ ప్రభుత్వ బాధ్యత అని ఆయన పునరుద్ఘాటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa