ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల నిబంధనల్లో పలు మార్పులు తీసుకొచ్చినట్లు సమాచారం. ఈ మేరకు పలు ఉద్యోగుల సివిల్ సర్వీస్ రూల్స్‌లో సవరణలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీని ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు సంవత్సరానికి పైగా అనధికార గైర్హాజరు అయితే.. ఉద్యోగం కోల్పోయే విధంగా రూల్స్‌లో పలు సవరణలు చేసినట్లు సమాచారం.
అందుతున్న సమాచారం ప్రకారం.. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల నిబంధనల్లోని 'సివిల్ సర్వీసెస్ రూల్స్'లో.. రూల్ 9, రూల్ 25కి సర్కార్ సవరణలు చేసినట్లు తెలుస్తోంది. సవరించిన నిబంధనల ప్రకారం ఏడాదికి పైగా అనధికార గైర్హాజరు అయితే ఉద్యోగం కోల్పోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఐదేళ్లకు మించి నిరంతరంగా గైర్హాజరు అయితే.. సేవల నుంచి తొలగిస్తారు. ఇక, ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశాలకు టూర్ వెళ్లినా చర్యలు తీసుకునే విధంగా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఇలాంటి చర్యలు తీసుకునే ముందు సదరు ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొన్నట్లు సమాచారం.
కాగా, సంక్రాంతి పండుగకు సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇటీవల సచివాలయంలో ఉద్యోగ సంఘాల డైరీని ఆవిష్కరించిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రకటన చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న కరువు భత్యం ఫైలుపై సంతకం చేసినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. అయితే దీని వల్ల ప్రభుత్వ ఖజానాపై ప్రతి నెలా రూ. 227 కోట్ల అదనపు భారం పడనుందని.. అయినప్పటికీ ఉద్యోగుల మొహంలో చిరునవ్వు చూడాలనే ఉద్దేశంతోనే ఈ అడుగు వేసినట్లు చెప్పారు. కాగా, 30.03 శాతం నుంచి 33.67 శాతానికి డీఏ సవరణ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
మరోవైపు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న సుమారు 5.14 లక్షల మంది శాశ్వత (పర్మినెంట్) ఉద్యోగులందరికీ.. రూ. 1.02 కోట్ల విలువైన ఉచిత ప్రమాద బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా.. ఈ బీమా పథకాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి రాష్ట్రంలోని ప్రముఖ బ్యాంకింగ్ సంస్థలతో ప్రభుత్వం ఇప్పటికే సంప్రదింపులు జరిపిందని ఆయన వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa