ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆడంబరాలకు స్వస్తి.. ఆదర్శానికి నాంది,,,,,రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 24, 2026, 07:44 PM

ప్రస్తుత సమాజంలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు వివాహం అంటే కోట్ల రూపాయల ఖర్చు, ఆర్భాటాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే చేసుకుంటామనే ఆలోచనతో ఖర్చుకు ఏమాత్రం వెనకడకుండా ఘనంగా చేసుకుంటున్నారు. కొందరైతే అప్పులు చేసి మరీ.. పెళ్లిళ్లు జరుపుకుంటున్నారు. కానీ.. సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్న ఇద్దరు యువ అధికారులు తమ పెళ్లిని అత్యంత సాదాసీదాగా జరుపుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయం ఈ అరుదైన, ఆదర్శవంతమైన వేడుకకు వేదికైంది. ఎటువంటి బ్యాండ్‌ మేళాలు, ఆడంబరాలు లేకుండా కేవలం చట్టబద్ధంగా రిజిస్టర్ వివాహం చేసుకొని ఈ జంట కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది.


చౌటుప్పల్ మండలం లింగారెడ్డిగూడెం గ్రామానికి చెందిన శేషాద్రిని రెడ్డి 2021 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారిణి. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్ డీసీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక వరుడు నెలటూరి శ్రీకాంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాకు చెందిన వారు. ఆయన 2025 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిగా ఎంపికై ప్రస్తుతం శిక్షణలో ఉన్నారు. పెద్దలు కుదిర్చిన ఈ వివాహాన్ని గ్రాండ్‌గా చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ.. విలాసాలకు వెళ్లకుండా నిరాడంబరంగా ఉండాలని ఈ యువ అధికారులు నిర్ణయించుకోవడం విశేషం.


ఈ వివాహ వేడుకకు కేవలం ఇరు కుటుంబాలకు చెందిన అతికొద్ది మంది సభ్యులు మాత్రమే హాజరయ్యారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సంతకాలు చేసిన అనంతరం.. పెద్దల సమక్షంలో ఒకరికొకరు పూలదండలు మార్చుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఉన్నత విద్యావంతులు, సమాజంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా వివాహాల పేరుతో మధ్యతరగతి, పేద కుటుంబాలు అప్పుల పాలవుతున్న ఈ రోజుల్లో.. ఖర్చు తగ్గించుకుని సామాజిక స్పృహతో మెలగాలని ఈ జంట సందేశాన్ని ఇచ్చింది.


ఐదు నిమిషాల ప్రక్రియ, రెండు సంతకాలతో ముగిసిన ఈ వివాహం.. యువతకు, రాబోయే తరాలకు ఒక దిక్సూచిలా నిలిచింది. పదవిలో ఉన్న గర్వం ప్రదర్శించకుండా.. సామాన్యులకు దగ్గరగా ఉంటూ ఐఏఎస్ శ్రీకాంత్ రెడ్డి, ఐపీఎస్ శేషాద్రిని రెడ్డి పాటించిన ఈ పద్ధతి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఈ కొత్త జంటను అభినందనలతో ముంచెత్తుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa