హైదరాబాద్‌లోని నాచారం ప్రాంతంలో రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించిన ఒక ఆఫర్ చివరకు ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. కేవలం 26 వేల రూపాయలకే కారు ఇస్తామంటూ సోషల్ మీడియాలో వచ్చిన ఒక ప్రకటనను నమ్మి వందలాది మంది ప్రజలు మోసపోయారు. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు ప్రచారాల పట్ల ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉండాలో మరోసారి గుర్తుచేసింది.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మల్లాపూర్‌కు చెందిన రోషన్ అనే పాత కార్ల వ్యాపారి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియో పోస్ట్ చేశాడు. గణతంత్ర దినోత్సవ కానుకగా తమ వద్ద ఉన్న 50 పాత కార్లను కేవలం 26,000 రూపాయలకే అమ్ముతామని ఆ వీడియోలో పేర్కొన్నాడు. ఈ ప్రకటన చూసిన జనం సోమవారం తెల్లవారుజామున 3 గంటల నుంచే మల్లాపూర్‌లోని అతని షోరూమ్ వద్ద బారులు తీరారు. నగరం నలుమూలల నుంచే కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా భారీగా జనం తరలిరావడంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది.
అయితే.. తీరా సమయం దగ్గరపడేసరికి వ్యాపారి మాట మార్చాడు. తన వద్ద కేవలం 10 కార్లు మాత్రమే ఉన్నాయని.. మిగిలినవి అమ్ముడుపోయాయని చెప్పడంతో జనం ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. ఆఫర్‌ను నమ్మి ఇంత దూరం వచ్చిన తర్వాత మాట మార్చడంతో ఆగ్రహం ఆపుకోలేక అక్కడున్న పాత కార్లపై రాళ్లతో దాడి చేసి అద్దాలను ధ్వంసం చేశారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది.
ఈ ఘటనపై నాచారం పోలీసులు కేసు నమోదు చేసి వ్యాపారి రోషన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా తప్పుడు ప్రకటనలు ఇచ్చి శాంతిభద్రతలకు విఘాతం కలిగించినందుకు అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి ఆకర్షణీయమైన ఆఫర్లను గుడ్డిగా నమ్మవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రజలు చైతన్యవంతంగా ఉండాలని.. అనుమానాస్పద ప్రకటనలు కనిపిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa