ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్టాక్ మార్కెట్ పేరుతో ,,,,ఏడాదిలోనే రూ.500 కోట్లు హాంఫట్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 26, 2026, 04:44 PM

ప్రస్తుత కాలంలో స్మార్ట్‌ఫోన్ వాడకం ఎంత పెరిగిందో, దాని ద్వారా జరిగే మోసాలు కూడా అంతే వేగంగా విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో అమాయకులను బురిడీ కొట్టిస్తూ సైబర్ నేరగాళ్లు కోట్లు గడిస్తున్నారు. ఒక్క 2025 సంవత్సరంలోనే కేవలం హైదరాబాద్ నగరంలోనే సుమారు రూ.500 కోట్లకు పైగా ప్రజలు నష్టపోయారంటే ఈ మోసాల తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా శేరిలింగంపల్లికి చెందిన ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఏకంగా రూ.2.9 కోట్లు పోగొట్టుకోవడం సంచలనం సృష్టించింది. మొదట రూ.5 వేల లాభాన్ని లబ్ధిదారుని ఖాతాకు క్రెడిట్ చేసి నమ్మకం కలిగించిన ముఠా.. ఆ తర్వాత అతడి జీవితకాల సంపాదనను కొల్లగొట్టింది. దీంతో బాధితుడు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.


కాగా, ఈ మోసాల తీరు అత్యంత వ్యూహాత్మకంగా సాగుతోంది. ప్రముఖ స్టాక్ మార్కెట్ విశ్లేషకులు లేదా పెద్ద కంపెనీల ఐపీవోల పేర్లతో వాట్సాప్‌లో లింకులు పంపుతున్నారు. ఆ లింక్ క్లిక్ చేయగానే బాధితులు ఒక గ్రూపులో చేరుతారు. ఆ గ్రూపులో ఉన్న వందలాది మంది నేరగాళ్ల అనుచరులు, తాము పెట్టుబడి పెట్టి భారీగా లాభపడ్డామంటూ నకిలీ స్క్రీన్‌షాట్లను పెడుతుంటారు. ఇది చూసి నిజమేనని నమ్మిన బాధితులు, నేరగాళ్లు సూచించిన యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుని డబ్బులు జమ చేస్తారు. యాప్‌లో అంకెలు పెరుగుతున్నట్లు కనిపిస్తుందే తప్ప, ఆ డబ్బును విత్ డ్రా చేసుకోలేరు. చివరికి సర్వం కోల్పోయాక గానీ ఇది మోసమని గ్రహించలేకపోతున్నారు.


సైబర్ పోలీసుల దర్యాప్తులో ఈ మోసాల వెనుక చైనీయులే ప్రధాన సూత్రధారులని తేలింది. వీరు థాయ్‌లాండ్, కంబోడియా, మయన్మార్ వంటి దేశాల నుంచి ఈ నెట్‌వర్క్‌ను నడిపిస్తున్నారు. ఉద్యోగాల పేరుతో భారత్ నుండి వెళ్లిన యువకులను అక్కడ నిర్బంధించి, వారి ద్వారానే మన దేశ ప్రజలపై ఈ డిజిటల్ దాడులు చేయిస్తున్నారు. ఈ చైనీస్ ముఠాలు దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసేలా వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్నాయి.


పెట్టుబడి పెట్టే ముందు ప్రజలు కొన్ని ప్రాథమిక విషయాలను గుర్తుంచుకోవాలి. స్టాక్ మార్కెట్ లావాదేవీల కోసం ప్రభుత్వం గుర్తింపు పొందిన నిర్దేశిత డీమ్యాట్ ఖాతాలు మాత్రమే ఉంటాయి. ఎవరైనా వ్యక్తిగత ఖాతాలకు డబ్బు పంపమని కోరితే అది నూటికి నూరు శాతం మోసమేనని గుర్తించాలి. సోషల్ మీడియాలో వచ్చే రీల్స్ లేదా వాట్సాప్ లింకులను నమ్మి నిర్ణయాలు తీసుకోవద్దు. అనుమతి లేకుండా మిమ్మల్ని ఎవరైనా గ్రూపుల్లో చేరిస్తే వెంటనే ఆ గ్రూపు నుండి బయటకు రావాలి. ఒకవేళ పొరపాటున మోసపోయినా, మొదటి రెండు గంటల్లోపు 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేస్తే పోగొట్టుకున్న సొమ్మును రికవరీ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa