కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలను తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్, ఐపీఎస్ అధికారుల సంఘం, ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించాయి. ఎమ్మెల్యే తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, కమిషనర్‌కు, ఇతర పోలీస్ అధికారులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తన స్వగ్రామమైన వీణవంకలో జరిగే సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు భారీ కాన్వాయ్‌తో బయలుదేరారు. అయితే, జాతర వద్ద రద్దీని నియంత్రించేందుకు, శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా పెద్ద కాన్వాయ్‌లకు అనుమతి లేదని పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే, ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు హుజూరాబాద్ పట్టణంలోని ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులకు, ఎమ్మెల్యే వర్గీయులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం పోలీసులు వారిని రోడ్డుపై నుంచి పక్కకు పంపించారు.ఆ తర్వాత వీణవంకలోని జాతర ప్రాంగణంలో సమ్మక్క గద్దె వద్ద కూడా కౌశిక్ రెడ్డి పోలీసులతో మరోసారి వాగ్వాదానికి దిగారు. గ్రామ సర్పంచ్‌ను కొబ్బరికాయ కొట్టనీయలేదని ఆయన ఆరోపించగా, పోలీసులు ఆ ఆరోపణలను ఖండించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని సైదాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించి, తర్వాత విడుదల చేశారు. ఈ ఘటనపై హుజూరాబాద్ పోలీసులు శుక్రవారం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులను దూషించి, ఆటంకం కలిగించారని ఆరోపిస్తూ భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.హైకోర్టు ఆదేశాలను అమలు చేస్తున్న పోలీసు అధికారులపై ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తెలంగాణ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు గోపిరెడ్డి ఎదుల తీవ్రంగా ఖండించారు. "ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా గుంపుగా వెళ్లడమే కాకుండా, కోర్టు ఆదేశాలను ఉల్లంఘించే ప్రయత్నం చేయడం దారుణం. అక్కడ లేని సీపీ మతాన్ని ప్రస్తావిస్తూ మాట్లాడటం అత్యంత హేయమైన చర్య" అని ఆయన మండిపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa