పటాన్చెరు : కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన 4 కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న చేపట్టనున్న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేసి.. కార్మిక వ్యతిరేక చట్టాలను తరిమికొట్టాలని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కార్మిక లోకానికి పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం పటాన్చెరు డివిజన్ పరిధిలోని క్యాంపు కార్యాలయం ఆవరణలో నూతన కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏర్పాటు చేసిన సమ్మె సన్నాహక సమావేశానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ఆర్థిక రంగానికి వెన్నుముకగా నిలుస్తున్న కార్మిక రంగానికి వెన్నుపోటు పొడుస్తూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం 29 పాత కార్మిక చట్టాలను రద్దుచేసి పెట్టుబడిదారులకు అనుకూలంగా నూతనంగా నాలుగు కార్మిక చట్టాలను తీసుకొని రావడం దుర్మార్గం అన్నారు.
ప్రధానంగా పారిశ్రామిక సంబంధాల కోడ్‌లోని నిబంధనల వల్ల ఉద్యోగ భద్రత దెబ్బతింటుందని, పెద్దసంస్థల్లో కూడా ప్రభుత్వ అనుమతి లేకుండా ఉద్యోగులను తొలగించే అవకాశం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పని గంటలను పెంచే అవకాశం ఉండడం వల్ల కార్మికుల ఆరోగ్యం, కుటుంబ జీవితం ప్రభావితమవుతుందని తెలిపారు. వచ్చే సంవత్సరం నుండి నుంచి దేశవ్యాప్తంగా కార్మికులపై బలవంతంగా రుద్దుతున్న లేబర్ కోడ్‌లు ప్రస్తుత 29 కార్మిక చట్టాల ద్వారా పొందుతున్న కనీస హక్కులను రద్దు కాబోతున్నాయని అన్నారు. న్యాయస్థానాల ద్వారా పొందే హక్కును సైతం నూతన లేబర్ కోడ్స్ నిరాకరిస్తున్నాయని అన్నారు.
పాత కార్మిక చట్టాల్లో కనీస వేతనం నిర్ణయించే అంశం కేంద్రం, రాష్ట్రాల ఉమ్మడి అంశంగా ఉందని..నూతన లేబర్ కోడ్‌లలో రాష్ట్రాల హక్కులు తొలగించడం బాధాకరమన్నారు. ఇక నుండి కేంద్రం కనీస వేతనాలు నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రాల పరిధిలో ఉన్న వేతనాలు ఇకపై కేంద్ర ప్రభుత్వ దయా దాక్షిణ్యాలపై ఆధారపడి ఉంటాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడగా చెందిన పటాన్చెరు నియోజకవర్గంలో నూతన చట్టాలు కార్మికుల పాలిట ఆశనిపాతంగా మారబోతున్నాయని అన్నారు. నూతన కార్మిక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టబోతున్న సార్వత్రిక సమ్మెలో ప్రతీ కార్మికుడు పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు..ఈ సమావేశంలో బిఆర్టియు రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు, బిఆర్టియు రాష్ట్ర కార్యదర్శి యాదగిరి యాదవ్, హెచ్ఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వర్ ప్రసాద్, హెచ్ఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి కొండా మనోహర్, బిఆర్టియు జిల్లా అధ్యక్షులు శివ శంకర్ రావు, సీనియర్ కార్మిక నాయకులు నరేందర్, రవి, రావు, లక్ష్మారెడ్డి, సాంబశివరావు, అశోక్, ఖాజా మొయినుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa