ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు .. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చాలా ఖరీదుగా మారాయి అనేది అర్థం అవుతోంది. పార్టీలు, అభ్యర్థులు అని తేడా లేకుండా.. డబ్బు, మద్యం, మాంసం, బహుమతులు, బంగారం, వెండిని ఓటర్లకు పంచుతూ.. వారిని ప్రసన్నం చేసుకుంటున్నారు. ఖరీదైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో పోటీ చేస్తున్న అభ్యర్థులు.. ఎలాగైనా కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా గెలిచి.. ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్, మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు.
మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగర శివార్లలో ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) పరిధిలో ఉన్న మున్సిపాలిటీల్లో ఓట్లను రాబట్టుకునేందుకు అభ్యర్థులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటుకు రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఓఆర్ఆర్, రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ జోరుగా జరిగే పరిధిలో కౌన్సిలర్ పదవి కోసం అభ్యర్థులు కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నారు. అది చూసి ఓటర్లే కాకుండా యావత్ రాష్ట్ర ప్రజలు కూడా ఆశ్చర్యంలో మునిగిపోతున్నారు.
ఈసారి ఎన్నికల్లో ప్రలోభాలు డబ్బు, మద్యంతోపాటు.. రకరకాల హామీలు గుప్పిస్తున్నారు. చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డులో పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి ఇచ్చిన హామీ ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఎన్నికల్లో తాను విజయం సాధిస్తే.. ఓటర్లకు అర తులం బంగారం ఉచితంగా ఇస్తానని బహిరంగంగానే ప్రకటించినట్లు సమాచారం. ఇక మరికొన్ని చోట్ల ఒక్కో ఓటుకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు డబ్బులు పంపిణీ చేస్తున్నారు.
వీటితో పాటు చికెన్, మటన్ విందులు, మద్యం పంపిణీతో ఓటర్లను తమకు ఓట్లు వేసేలా పురమాయించేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవే కాకుండా ఇంట్లో అవసరమయ్యే వస్తువులను కూడా గిఫ్ట్‌ల రూపంలో అందిస్తున్నారు. టీవీలు, వాషింగ్ మెషీన్లు, ఫ్రిజ్‌లు, రైస్ కుక్కర్లు, ప్రెజర్ కుక్కర్లు, మిక్సీలు, గ్రైండర్లను ఓటర్లకు ఇచ్చి వారిని తమకే ఓటు వేసేలా గాలం వేస్తున్నారు.
అయితే ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలు లేకుండా ఓటర్లు స్వేచ్ఛగా ఓట్లు వేసేలా.. ఈ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం అవేమీ లేకుండా దర్జాగా ప్రలోభాల పర్వం కొనసాగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా ఎన్నికల్లో డబ్బులు వెదజల్లి గెలిచిన అభ్యర్థులు.. పదవిలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు చేయకుండా ప్రభుత్వ సొమ్మును కొల్లగొడతారనే భయాలను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa