Telangana BC Reservations: తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల పెంపు అంశం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వెళ్లింది. రాష్ట్రంలోని విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ప్రస్తుత స్థాయి నుంచి 42 శాతానికి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించగా, దీనికి సంబంధించిన కీలక అప్‌డేట్‌ను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా వెల్లడించింది.లోక్‌సభలో ఎంపీ ఈటల రాజేందర్ అడిగిన ప్రశ్నకు కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ మంత్రి బీఎల్ వర్మ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. తెలంగాణ శాసనసభ కార్యదర్శి ద్వారా బీసీ రిజర్వేషన్ల పెంపుకు సంబంధించిన రెండు బిల్లులు కేంద్రానికి అందాయని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ బిల్లులు రాష్ట్రపతి ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వం వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.రిజర్వేషన్ల శాతం పెంపు రాజ్యాంగపరమైన అంశాలతో ముడిపడి ఉండటంతో, రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన ఈ రెండు బిల్లులను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ద్వారా రాష్ట్రపతి భవన్‌కు పంపినట్లు మంత్రి వివరించారు. తెలంగాణలో బీసీ వర్గాలకు సామాజిక న్యాయం కల్పించే లక్ష్యంతో 42 శాతం రిజర్వేషన్ అమలు ప్రతిపాదనపై కేంద్రం వివిధ కోణాల్లో అధ్యయనం చేస్తోందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ బిల్లులు పరిశీలన దశలోనే ఉన్నాయని, తదుపరి చర్యలు పూర్తిగా రాష్ట్రపతి ఆమోదంపై ఆధారపడి ఉంటాయని ఆయన వెల్లడించారు.ఈటల రాజేందర్ అడిగిన ప్రశ్నతో బీసీ రిజర్వేషన్ల పెంపుపై రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితికి కొంతవరకు స్పష్టత వచ్చినట్లయింది. ఇకపై కేంద్రం తీసుకునే నిర్ణయంపైనే తెలంగాణలోని బీసీ వర్గాల రాజకీయ, సామాజిక, ఉపాధి భవిష్యత్తు ఆధారపడి ఉండనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa