పేదలకు కార్పొరేట్ స్థాయి సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని పూర్తి ఉచితంగా అందించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సనత్‌నగర్ టిమ్స్ (TIMS) ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఉగాది పండుగ రోజున ఈ హాస్పిటల్‌ను ప్రారంభించి ప్రజలకు అంకితం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈలోగా సివిల్ పనులు, ఎక్విప్మెంట్ ట్రయల్స్ అన్నీ పూర్తి చేసి, హాస్పిటల్‌ను వైద్య సేవలు అందించేందుకు సిద్ధం చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ఈరోజు హైదరాబాద్‌లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆఫీస్‌లో టిమ్స్ సనత్‌నగర్ పనుల పురోగతి, డాక్టర్లు, సిబ్బంది నియామకంపై మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఓపీ రూమ్‌లు, డయాగ్నస్టిక్స్, ఇన్‌పేషెంట్ డిపార్ట్మెంట్లు, వార్డులు, ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూల ఏర్పాటుపై మంత్రి ఆరా తీశారు. 1000 బెడ్ల కెపాసిటీతో నిర్మించిన సనత్‌నగర్ టిమ్స్‌లో మౌలిక వసతుల కల్పన తుది దశకు చేరుకుందని అధికారులు మంత్రికి వివరించారు. హాస్పిటల్ అత్యంత కీలకమైన 16 ఆపరేషన్ థియేటర్లు (OTs) శస్త్రచికిత్సలకు సిద్ధంగా ఉన్నాయన్నారు. రోగ నిర్ధారణ కోసం అత్యాధునిక సీటీ స్కాన్ (CT Scan), ఎంఆర్ఐ (MRI), డిజిటల్ ఎక్స్-రే మిషన్ల ఇన్స్టాలేషన్ ప్రక్రియ పూర్తయ్యిందని అధికారులు అన్నారు. డయాగ్నస్టిక్స్ యంత్రాలు ఇన్స్టాలేషన్ జరుగుతోందన్నారు. మార్చి రెండో వారం నాటికి అన్ని పనులు, ఎక్విప్మెంట్ ఇన్స్టాలేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. హాస్పిటల్ ప్రారంభమయ్యే నాటికి టెక్నీషియన్లకు, సిబ్బందికి ట్రైనింగ్ కూడా పూర్తి చేయాలని మంత్రి సూచించారు.
సనత్‌నగర్ టిమ్స్‌ను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ కార్డియాక్ కేర్, సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌గా తీర్చిదిద్దాలని గతంలోనే అధికారులకు మంత్రి సూచించారు. ఇందుకు అనుగుణంగా అన్నిరకాల గుండె సంబంధిత ఆపరేషన్లు చేసేలా, అవయవ మార్పిడి శస్ర్తచికిత్సలు నిర్వహించేలా క్యాథల్యాబ్స్, ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ థియేటర్ల ఏర్పాటుపై మంత్రి ఆరా తీశారు. సమావేశంలో ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జడ్ చొంగ్తు, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ, డీఎంఈ డాక్టర్ నరేంద్ర కుమార్, టీజీఎంఎస్ఐడీసీ ఎండీ ఫణీంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa