ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వెలుగుమట్ల భూదాన్ భూ బాధితులను కలిసిన కేటీఆర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 26, 2026, 07:40 PM

ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో భూదాన్ భూ బాధితులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిశారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ... శత్రుదేశంపై దండయాత్రకు వెళ్లినట్లు 4000 మంది పోలీసుల పహారాలో పేదల ఇళ్లను కూల్చివేయడం ఇందిరమ్మ రాజ్యమా? అని నిలదీశారు. బాధితులకు అండగా ఉంటామని, బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఇదే స్థలంలో ఇళ్లు కట్టించి ఇచ్చే బాధ్యత తనదని ఆయన భరోసా ఇచ్చారు.ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులే ఈ అక్రమాలకు సూత్రధారులని కేటీఆర్ ఆరోపించారు. సుమారు 60 ఎకరాల విలువైన భూదాన్ భూములపై మంత్రుల కన్ను పడిందని, వారి అక్రమ సంపాదన కోసమే పేదలను రోడ్డున పడేశారని మండిపడ్డారు. ప్రభుత్వం ఎలాంటి తప్పు చేయకపోతే ముగ్గురు మంత్రులు నేరుగా ఇక్కడికి వచ్చి బాధితులకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. ఏ తప్పు జరగనప్పుడు ఆర్డీవోను ఎందుకు బదిలీ చేశారని ప్రశ్నించిన ఆయన, ఒక అధికారిని బలిపశువు చేసి ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తోందని విమర్శించారు.పేదల ఉసురు తగిలి తీరుతుందని, అధికారులను అడ్డం పెట్టుకుని ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న మంత్రుల వైఖరిని అసెంబ్లీలోనూ, కౌన్సిల్‌లోనూ ఎండగడతామని కేటీఆర్ హెచ్చరించారు. పట్టాలు సక్రమంగా ఉన్నా, కేవలం కాంగ్రెస్ నేతల వంకర బుద్ధితోనే ఈ దాడులు జరిగాయని ధ్వజమెత్తారు.ఒకప్పుడు దేశంలో ఒరిజినల్ గాంధీలు ఉండేవారు, ఇప్పుడు డూప్లికేట్ గాంధీలు తయారయ్యారు అంటూ ఎద్దేవా చేశారు. పేదల ఇళ్లు కూల్చిన పాపం మంత్రులను విడిచిపెట్టదని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa