ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సైబర్ మోసంతో రూ.11 లక్షలు కాజేసిన కేటుగాళ్లు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 27, 2026, 03:00 PM

సీపీఐ దివంగత నేత సురవరం సుధాకర్‌రెడ్డి భార్య బీవీ విజయలక్ష్మి (75) సైబర్ మోసగాళ్ల చేతిలో చిక్కి సుమారు రూ.11 లక్షలు పోగొట్టుకున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేరుతో ఉన్న నకిలీ ప్రకటనను నమ్మి ఆమె ఈ మోసానికి గురయ్యారు.పోలీసుల కథనం ప్రకారం.. గత ఏడాది డిసెంబర్‌లో విజయలక్ష్మి సోషల్ మీడియాలో ఓ పెట్టుబడి ప్రకటనను చూశారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఫొటోతో ఉన్న ఆ ప్రకటనలో సెబీ గుర్తింపు పొందిన 'క్వాంటాపల్స్' అనే సంస్థ ద్వారా ట్రేడింగ్ చేస్తే అధిక లాభాలు వస్తాయని ఉంది. అది నిజమని నమ్మిన ఆమె, అందులో ఉన్న లింక్‌పై క్లిక్ చేశారు. వెంటనే ఆమెకు వాట్సాప్‌లో 'ఆదిత్య సుబ్రహ్మణ్యం' అనే వ్యక్తి పరిచయమయ్యాడు. రిజిస్ట్రేషన్ ఫీజు కింద తొలుత రూ.13 వేలు కట్టించుకున్నాడు.ఆపై పెట్టుబడి పేరుతో జనవరి 30న రూ.1.99 లక్షలు బదిలీ చేయించుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత యూకే నుంచి 'ఆడమ్ స్మిత్' అనే మరో వ్యక్తి ఫోన్ చేసి, లాభాలు డాలర్లలో వచ్చాయని నమ్మించాడు. అయితే, లావాదేవీలు రద్దయ్యాయని, ట్యాక్స్ కట్టాలని చెప్పి విడతల వారీగా ఫిబ్రవరి 13 వరకు మొత్తం రూ.10.91 లక్షలు కాజేశాడు. పదేపదే డబ్బు అడుగుతుండటంతో అనుమానం వచ్చిన విజయలక్ష్మి, తాను మోసపోయానని గ్రహించి సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa