ఢిల్లీ మద్యం విధానం కేసులో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో భారీ ఊరట లభించిన సంగతి తెలిసిందే. సరైన సాక్ష్యాధారాలు లేవంటూ కోర్టు ఆమెతో పాటు కేసులో అందరికీ క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని తన నివాసం వద్ద కవిత మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు."సత్యమేవ జయతే. మేము ముందు నుండి కూడా తెలంగాణ ప్రజలకు చెపుతున్నట్టుగానే కేసులోని అందరినీ నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది. న్యాయ వ్యవస్థపై నేను పెట్టుకున్న నమ్మకం వమ్ముకాలేదు. రాజకీయ కక్షలో భాగంగా నాపై పెట్టిన కేసుల నుంచి కడిగిన ముత్యంలా బయటకు వస్తానని నేను చెప్పారు. చెప్పిన విధంగానే ఈరోజు జరిగింది. లిక్కర్ కేసు ఒక రాజకీయ కుట్ర. రాజకీయ కారణాలతోనే నాపై కేసు పెట్టారు. కేసుని అడ్డం పెట్టుకుని నాపై రకరకాలుగా మాట్లాడినవారు, నన్ను హింసించినవారు ఇప్పుడు ఏం చెబుతారు?నేను జైల్లో ఉన్నప్పుడు జాగృతి నేతలు, కార్యకర్తలు, తెలంగాణ ప్రజలు నాకు, నా కుటుంబానికి అండగా నిలబడ్డారు. ఢిల్లీలో కోర్టు హియరింగ్ ల సందర్భంగా సొంత డబ్బులు పెట్టుకుని ఢిల్లీకి వచ్చిన ఎంతో మంది నాకు తెలుసు. వారందరినీ జీవితంలో మర్చిపోకుండా కళ్లలో పెట్టుకుని చూసుకుంటానని మాట ఇస్తున్నా. నేను జైల్లో ఉన్న సమయంలో మా పిల్లలకు అండగా నిలబడ్డ.. ముఖ్యంగా మా అత్తామామయ్యల గారికి, మా మదర్ కి, ఫాదర్ కి, జాగృతి కుటుంబానికి, తెలంగాణ కుటుంబానికి ధన్యవాదాలు. నాకు అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు " అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa