తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఈసారి ఫిబ్రవరి రెండో వారం నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం 8 తర్వాత నుంచే ఎండలు భగ భగ మండుతున్నాయి. మధ్యాహ్నం సమయానికి కాలు బయట పెట్టలేని పరిస్థితి. ఇక రాత్రి సమయాల్లో తీవ్రమైన ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా రాష్ట్రంలో విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగింది. విద్యుత్ వినియోగంలో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. టీజీఎన్పీడీసీఎల్ చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా ఫిబ్రవరి చివరి వారంలో శనివారం గరిష్ట విద్యుత్ డమాండ్ 6,057 మెగావాట్లు నమోదు అయింది.
తాజాగా ఆ రికార్డు సైతం చెరిగిపోయింది. ఇవాళ చరిత్రలోనే అత్యధిక గరిష్ట విద్యుత్ డిమాండ్ 6,267 మెగావాట్లు నమోదైనట్లు టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి వెల్లడించారు. శనివారం నమోదైన హై పీక్ డిమాండ్ కొన్ని గంటల వ్యవధిలోనే అధిగమించిపోయిందని చెప్పారు. టీజీఎన్పీడీసీఎల్ చరిత్రలో ఇది ఒక మైలురాయిగా నిలిచిందని ఆయన స్పష్టం చేశారు. రోజురోజుకు ఎండలు మండిపోతుండటంతో విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరుగుతోందని వెల్లడించారు. అయినా సరే ప్రజలకు ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు తాము ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
డిమాండ్ ఎంత పెరిగినా విద్యుత్ సరఫరాలో అంతరాయం రాకుండా విద్యుత్ అందించేందుకు సంస్థ పూర్తిగా సమాయత్తమై ఉందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, ఉన్నతాధికారుల పర్యవేక్షణ, దిశానిర్దేశంతో తెలంగాణ విద్యుత్ వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరా అందించడమే తమ లక్ష్యమని అన్నారు. రానున్న రోజుల్లో డిమాండ్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అందుకు సంస్థ పూర్తిగా సిద్ధంగా ఉందని.. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తంగా చర్యలు తీసుకుంటున్నామని సీఎండీ వివరించారు.
కాగా, ఈ ఏడాది వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే ఐఎండీ స్పష్టం చేసింది. మార్చి చివరి వారం నుంచి మే వరకు వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ముఖ్యంగా హైదరాబాద్, మహబూబ్నగర్, నల్గొండ జిల్లాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa