తెలంగాణ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి పెద్దపీట వేస్తోంది. తెలంగాణను దేశపు క్రీడా రాజధాని మార్చడమే లక్ష్యంగా సీఎం రేవంత్.. తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ 2025ను ప్రవేశపెట్టారు. ఈ పాలసీలో భాగంగా 2036 ఒలింపిక్స్లో మన రాష్ట్ర క్రీడాకారులు పతకాలు సాధించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు హైదరాబాద్ గచ్చిబౌలిలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నారు. దీని కోసం సుమారు 200 ఎకరాల భూమిని కేటాయించారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో మినీ స్టేడియాలు, ప్రతి లోక్సభ నియోజకవర్గంలో స్పోర్ట్స్ స్కూల్స్ నిర్మించాలని నిర్ణయించారు.
అందులో భాగంగా.. వరంగల్ జిల్లాలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు రెడీ అయ్యారు. ఈ విషయాన్ని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వెల్లడించారు. త్వరలోనే జిల్లాకు క్రికెట్ స్టేడియం వస్తుందని చెప్పారు. జిల్లాలో క్రికెట్ స్టేడియం ఆవశ్యకతను సీఎం రేవంత్ రెడ్డికి వివరించగా.. ఆయన సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే కడియం తెలిపారు. ప్రస్తుతం స్టేడియం నిర్మాణానికి సంబంధించిన ఫైల్ ప్రభుత్వం వద్ద ఉందని అన్నారు.
కాగా, జిల్లా యువత చాలా కాలంగా క్రికెట్ స్టేడియం కోసం ఎదురు చూస్తోంది. ఈ మేరకు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నేతృత్వంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ విషయాన్ని సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన సీఎం సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం ఉనికిచర్ల శివారులోని 163 నేషనల్ హైవేకు సమీపంలో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా)కు భూమి ఉంది. దీంతో ఆ ప్రాంతంలోనే స్టేడియం నిర్మాణం చేపడితే అనుకూలంగా ఉంటుందనే నిర్ణయానికి అధికారులు వచ్చారు.
దీంతో కుడా పరిధిలోని 30 ఎకరాల భూమి వివరాలను ఎమ్మెల్యేలు, ఎంపీలు రాష్ట్ర స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీసెస్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ జయేశ్రంజన్కు అందజేశారు. ప్రస్తుతం ఈ ఫైల్ పెండింగ్లో ఉండగా.. త్వరలోనే స్టేడియం నిర్మాణానికి అనుమతులు రానున్నాయి. అదే జరిగితే క్రికెట్ ప్రేమికుల చిరకాల కోరిక తీరనుంది. వరంగల్ కేంద్రంగా అంతర్జాతీయస్థాయి మ్యాచ్లకు ఆతిథ్యమిచ్చే ఛాన్స్ ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa