మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా ప్రగతినగర్‌లో ప్రజావసరాలకు ఉద్దేశించిన భూములు కబ్జాకు గురౌతున్నాయని వాటిని హైడ్రా కాపాడాలని అక్కడి నివాసితులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ప్రగతినగర్ స్మశానవాటిక స్థలం 5 ఎకరాలవరకూ ఉండగా.. కబ్జాలకు గురౌతోందని స్థానికంగా నివాసం ఉంటున్న ఆలేటి శ్రీనివాస రావు, జశ్వంత్‌తో పాటు పలువురు స్థానికులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. స్మశాన వాటికను ఆనుకునే చెత్త డంపింగ్ యార్డుకు కూడా కేటాయించిన స్థలం దాదాపు 4 ఎకరాల వరకూ ఉన్న ప్రభుత్వ భూమి కూడా కబ్జాలకు గురౌతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. సర్వే అధికారులు కూడా నిర్ధారించారని.. హైడ్రా వెంటనే రంగంలోకి దిగి కాపాడాలని కోరారు. అలాగే బాచుపల్లి పెద్దకుంట చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ పరిధిలో శ్మశాన వాటిక నిర్మిస్తున్నారని.. కోర్టులో కేసు పెండింగ్ ఉన్నప్పటికీ నిర్మాణాలు ఆగడంలేదని శిఖర రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేసింది. శేరిలింగంపల్లి మండలం మదీనాగూడలోని పోచమ్మ దేవాలయానికి చెందిన స్థలంలో అపార్టు మెంటు కడుతున్నారని.. గ్రామస్తులు అడ్డుకోగా ఆగిందని.. దీనిపై కోర్టుకు కూడా వెళ్లామని ప్రజావాణి ఫిర్యాదులో అక్కడి నివాసితులు ఫిర్యాదు చేశారు. న్యాయస్థానంలో కేసు పెండింగ్ ఉన్నా అక్కడ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. ఇదే పరిస్థితి అమీన్‌పూర్ సర్వేనంబరు 971లోని పోచమ్మకుంటలో కూడా స్మశాన వాటికను నిర్మిస్తున్నారని.. ఈ చెరువుల ఎఫ్‌టీఎల్ పరిధిలను కాపాడాలని హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు అందింది. మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం బోడుప్పల్ ఎస్‌బీఆర్ కాలనీలో 25 ఫీట్ల రహదారిని 5 అడుగుల మేర ఆక్రమించి షాపులు నిర్మించారని.. దీంతో అంబులెన్స్‌లు, పాఠశాల బస్సులు రాలేని పరిస్థితి ఉందని హైడ్రా ప్రజావాణిలో ఎస్‌బీఆర్ కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. రహదారిని ఆక్రమించి నిర్మించిన షట్టర్లను తొలగించాలని కోరారు. ఇలా హైడ్రా ప్రజావాణికి మొత్తం 42 ఫిర్యాదులందగా.. హైడ్రా అదనపు సంచాలకులు శ్రీ వర్ల పాపయ్యగారు వాటిని పరిశీలించి పరిష్కార బాధ్యతలను సంబంధిత అధికారులకు అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa