తెలంగాణ నుంచి లక్షలాది మంది జనం ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి పనిచేస్తున్నారు. ఇక్కడ చేయడానికి పనుల్లేక, చేసిన పనులకు సరైన డబ్బులు రాకపోవడంతో.. విదేశాలకు వెళ్లి కష్టపడితే ఎక్కువ డబ్బులు వస్తాయనే ఆశతో చాలా మంది వెళ్తున్నారు. అక్కడికి వెళ్లిన వారు బాగా సంపాదిస్తుండటంతో ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు, తెలిసిన వాళ్లు కూడా ఆయా దేశాలకు వెళ్లి డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇరాన్, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్, ఒమన్, ఖతార్, కువైట్ వంటి దేశాల్లో భారీ సంఖ్యలో భారత్ నుంచి వెళ్లిన వాళ్లు ఉన్నారు. అందులో ఒక్క తెలంగాణ నుంచే దాదాపు 15 లక్షల మంది ప్రజలు ఈ గల్ఫ్ దేశాల్లో రకరకాల పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంతో అక్కడ ఉన్న తెలంగాణ వాసుల పరిస్థితి ఏంటి అనేది ప్రశ్నార్థకంగా మారింది.
అమెరికా, ఇజ్రాయిల్ కలిసి ఇరాన్‌పై యుద్ధం ప్రకటించగా.. ఈ దాడులు మొత్తం గల్ఫ్ దేశాలకు అంటున్నాయి. దీంతో ఆయా దేశాల్లో ఉన్న తెలుగువారి భద్రతపై తెలుగు రాష్ట్రాల్లోని కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇక తెలంగాణ నుంచి గల్ఫ్ దేశాల్లో 15 లక్షల మంది తెలంగాణవాసులు ఉండగా.. అందులో 9 లక్షల మంది ఉత్తర తెలంగాణకు చెందినవారే ఉండడం గమనార్హం. ఇక సౌదీ అరేబియా, దుబాయ్, షార్జా, అబుదాబీ, ఒమన్, ఖతార్, బహ్రెయిన్, కువైట్ దేశాల్లో మొత్తంగా 90 లక్షల మంది భారతీయులు ఉండగా.. అందులో 15 లక్షల మంది తెలంగాణ, మరో 15 లక్షల మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు ఉన్నారని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
ఇక ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి 2.5 లక్షల మంది.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి మరో 2 లక్షల మంది.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి 1.5 లక్షల మంది గల్ఫ్ దేశాలకు వలస వెళ్లి జీవిస్తున్నారు. ఇక సిద్దిపేట జిల్లాకు చెందిన 15 వేల మంది పలు రకాల పనులు చేస్తున్నారు. ఒక్క ఇజ్రాయెల్‌లోనే నిజామాబాద్ జిల్లా నుంచి 700 మంది పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన వారు యూఏఈ, ఒమన్ వంటి దేశాల్లో కార్మికులుగా పనిచేస్తున్నారు.
ఇజ్రాయెల్, అమెరికా దేశాలపై కోపంతో.. గల్ఫ్ దేశాలపై ఇరాన్ సైన్యం క్షిపణి, డ్రోన్‌లతో విరుచుకుపడుతోంది. దీంతో ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లోని చాలా కంపెనీల్లో పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే గత రెండు రోజులుగా వలస కార్మికులు మొత్తం బంకర్లలోనే తలదాచుకుంటున్నారు. నిత్యం సాయంత్రం 4 గంటల నుంచి ఉదయం వరకు బాంబుల శబ్దాలు దద్దరిల్లిపోతున్నాయని.. బంకర్లలో దాక్కొని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటున్నట్లు అక్కడి ఉన్నవారు తమ కుటుంబ సభ్యులకు చెబుతున్నారు. వారు అక్కడ క్షేమంగానే ఉన్నట్లు చెప్పినా.. ఇక్కడ ఉన్న వారు మాత్రం భయం గుప్పిట్లోనే జీవిస్తున్నారు.
మరోవైపు.. ఇప్పటికే గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న వారి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని వారికి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇక మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లు వలస కార్మికుల కుటుంబ సభ్యులు, బంధువులతో మాట్లాడి వారికి ధైర్యం చెబుతున్నారు. ప్రభుత్వం తరఫున చేయాల్సిన సాయాన్ని చేస్తామని హామీ ఇచ్చారు. గల్ఫ్ దేశాల్లో ఉన్నవారిని రక్షించేందుకు అన్ని చర్యలు చేపడతామని కేంద్రమంత్రి బండి సంజయ్ కూడా వెల్లడించారు.
మరోవైపు.. గల్ఫ్ కార్మికుల సమాచారం తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎమర్జెన్సీ టోల్‌ఫ్రీ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది. అబుదాబీ (యూఏఈ) టోల్‌ఫ్రీ నంబర్ 800-46342.. వాట్సాప్ +971543 090571.. కువైట్ +96565 501946.. బహ్రెయిన్ 00973-39418071.. మస్కట్ (ఒమన్) 800 71 234.. జోర్డాన్ 00962 770422 276.. బాగ్దాద్ (ఇరాక్) +964 771 651 1185.. టెహ్రాన్ (ఇరాన్) +9891 281 09115.. సౌదీ అరేబియా 00 966 114 884 697.. దోహా (ఖతార్) 00974 5564 7502.. పాలస్తీనా +970 592916418 నంబర్లకు సంప్రదించి తమ వారి క్షేమ సమాచారం తెలుసుకోవచ్చని సూచించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయిచైతన్య.. గల్ఫ్ కార్మికుల కోసం కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. కార్మికులు 87126 59700, 87126 59821 నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు.
తెలంగాణ భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో తెలంగాణ ప్రభుత్వం కంట్రోల్ రూంను ఏర్పాటు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో తెలంగాణ ప్రజల భద్రత కోసం దీన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. విదేశాంగ శాఖతో పాటు ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలతో తెలంగాణ భవన్ అధికారులు ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తున్నారు. విదేశాల్లోని తెలంగాణవారికి ఇబ్బందులు, ప్రయాణ అంతరాయాలు, ఎమర్జెన్సీ ఎదురైతే కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని తెలిపారు. 24 గంటల పాటు 9871999044, 58322143, 991014749, 9643723157 నంబర్లను అందుబాటులో ఉంచారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa