ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాష్‌రూంలో ఇంటర్ స్టూడెంట్ ప్రసవం, చెత్తబుట్టలో శిశువు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 04, 2026, 06:25 PM

నాగర్‌కర్నూలు జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసిది. 16 ఏళ్ల ఇంటర్ అమ్మాయి ప్రైవేటు స్కానింగ్ సెంటర్‌లోని టాయిలెట్‌లోనే ప్రసవించింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. ఇంటర్ చదివే స్టూడెంట్ సోమవారం (మార్చి 2) ఉదయం పరీక్షలకు హాజరైంది. అదే రోజు సాయంత్రం తల్లితో కలిసి కడుపునొప్పిగా ఉందంటూ స్థానిక ఆసుపత్రికి వెళ్లింది. డాక్టర్లు పరీక్షించి కడుపులో గడ్డలు, ఇతర సమస్యలు ఉండవచ్చుననే అనుమానంతో స్కానింగ్‌ చేయించుకోవాలని చెప్పారు. దీంతో వారు సమీపంలోని ఒక ప్రైవేటు స్కానింగ్ సెంటర్‌కు వెళ్లారు. అక్కడ ఫీజు చెల్లించే ప్రక్రియ జరుగుతుండగానే.. బాలికకు తీవ్రమైన నొప్పులు రావడంతో వాష్‌రూంకి వెళ్లింది. వాష్‌రూంలోనే తల్లి సాయంతో బాలిక పండంటి మగ శిశువుకు జన్మనిచ్చింది.


గర్భం దాల్చిన విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందనే ఆందోళనతో, ఆమె తల్లి అప్పుడే పుట్టిన పసికందును అక్కడే ఉన్న చెత్తబుట్టలో పడేసింది. అనంతరం అక్కడి నుంచి బయటపడేందుకు ప్రయత్నించింది. వాష్‌రూం నుంచి వెలువడిన వింత శబ్దాలు, బాలిక తల్లి ప్రవర్తనను గమనించిన స్కానింగ్ సెంటర్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. చెత్త బుట్టలో శిశువును చూసి షాక్ అయ్యారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. రక్తస్రావంతో నీరసించిపోయిన బాలికను, శిశువును వెంటనే నాగర్‌కర్నూల్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ తరలించారు. ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. మైనర్ బాలిక గర్భం దాల్చడం వెనుక ఎవరి ప్రమేయం ఉందనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.


కాగా, వారం రోజుల క్రితం కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఓ ఇంటర్ స్టూడెంట్ పరీక్షా కేంద్రం వాష్‌రూంలోనే బిడ్డను ప్రసవించింది. పరీక్ష మెుదలైన కాసేపటికే ఇన్విజిలేటర్ అనుమతితో వాష్‌రూంకి వెళ్లి అక్కడే మృత శిశువును ప్రసవించింది. అనంతరం అక్కడే ఉన్న వాష్ బేసిన్‌లో బిడ్డను కుక్కేసింది. గమనించిన పరీక్షా కేంద్రం సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృత శిశువును మార్చురీకి తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa