కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలు డివిజన్లలో నెలకొన్న ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు గళమెత్తారు. స్థానిక బీజేపీ అధ్యక్షుడు సతీష్ సాగర్, జిల్లా ఉపాధ్యక్షులు రాజిరెడ్డి ఆధ్వర్యంలో గురువారం కొంపల్లి సర్కిల్ డిప్యూటీ కమిషనర్ కృష్ణారెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కొంపల్లి ప్రాంతం అభివృద్ధిలో వెనుకబడిపోతోందని, కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారని తీవ్ర స్థాయిలో విమర్శించారు.
ముఖ్యంగా అవని గార్డెన్, అపర్ణ పామ్ గ్రూవ్, డిలైట్ ఫార్చ్యూన్ వంటి కాలనీలతో పాటు ఎం.ఆర్.ఎఫ్ టైర్స్ రోడ్, జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న నివాస ప్రాంతాలలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని నేతలు పేర్కొన్నారు. మురికినీరు రోడ్లపైకి ప్రవహిస్తుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దుర్వాసనతో అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. జయాబేరి పార్క్, ఎన్.సి.ఎల్, ఉమామహేశ్వర కాలనీ వంటి చోట్ల రోడ్లు అధ్వానంగా తయారై ప్రయాణం నరకప్రాయంగా మారిందని వారు వివరించారు.
వీధి దీపాలు లేకపోవడం వల్ల రాత్రి సమయాల్లో మహిళలు, వృద్ధులు బయటకు రావాలంటే భయాందోళన చెందుతున్నారని సతీష్ సాగర్ పేర్కొన్నారు. దీనికి తోడు వీధి కుక్కల బెడద విపరీతంగా పెరిగిపోయిందని, చిన్నారులపై దాడులు జరుగుతున్నా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కాలనీ వాసుల భద్రతను గాలికొదిలేసి, పన్నుల వసూలుపై చూపే శ్రద్ధ అభివృద్ధి పనులపై చూపడం లేదని అధికారులపై ధ్వజమెత్తారు.
డిప్యూటీ కమిషనర్ కృష్ణారెడ్డి స్పందిస్తూ, వినతి పత్రంలోని అంశాలను పరిశీలించి త్వరలోనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే, వారం రోజుల్లోగా క్షేత్రస్థాయిలో మార్పు కనిపించకపోతే, ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని బీజేపీ నాయకులు హెచ్చరించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేస్తామని, పాలకులు ఇప్పటికైనా మొద్దునిద్ర వీడాలని వారు డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa