తెలంగాణలో దాదాపు 2 ఏళ్ల ఆలస్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. జనవరి నెలలోనే గ్రామాల్లో కొత్త పాలక వర్గాలు ఏర్పడి.. సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లతో పాలన సాగుతోంది. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆలస్యం చేయడంతో.. కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయకుండా పెండింగ్‌లో ఉంచింది. ఎన్నికలు పూర్తి అయిన తర్వాత మాత్రమే వాటిని రిలీజ్ చేస్తామని తేల్చి చెప్పింది. దీంతో ఇటీవల ఎన్నికలు పూర్తై గ్రామాల్లో కొత్త సర్పంచ్‌లు వచ్చిన తర్వాత.. దశల వారీగా 15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్రం విడుదల చేస్తోంది. అదే సమయంలో గ్రామాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులను కేటాయిస్తోంది. ఇక్కడే ఇప్పుడు అసలు సమస్య మొదలైంది.
పలు విడతల్లో కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు సుమారు రూ. 1,034 కోట్ల నిధులను ఇటీవలె విడుదల చేసింది. ఇప్పుడు ఈ నిధుల గురించే.. కొత్త సర్పంచ్‌లు, పాత సర్పంచ్‌లకు మధ్య తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. తాము గతంలో సర్పంచ్ హోదాలో గ్రామాల్లో చేపట్టిన మౌలిక సదుపాయాలు కల్పించామని.. వైకుంఠధామాలు, డ్రైనేజీలు, క్రీడా ప్రాంగణాలు వంటి అభివృద్ధి పనులు చేసినట్లు పాత సర్పంచులు చెబుతున్నారు. ఆ పనులకు అప్పట్లో బిల్లులు రాకపోవడంతో తీసుకొచ్చిన అప్పులకు వడ్డీలు పెరుగుపోతున్నాయని పాత సర్పంచ్‌లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెండింగ్‌లో ఉన్న దాదాపు రూ.1,000 కోట్లకు పైగా పాత బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం విడుదలైన నిధులపై తమకే హక్కు ఉంటుందని తేల్చి చెబుతున్నారు. ఇక.. కొత్త సర్పంచ్‌లు మాత్రం వాటికి ససేమిరా అనడంతో అసలు వివాదం మొదలైంది. తాము పంచాయతీ ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చి, గ్రామాలను డెవలప్ చేస్తామని ప్రజలకు మాట ఇచ్చామని.. ఇప్పటివరకు వచ్చిన నిధులు మొత్తాన్ని పాత బకాయిలకే చెల్లిస్తే.. ఇక గ్రామాల్లో అభివృద్ధి ఎలా చేయాలంటూ ప్రశ్నిస్తున్నారు.
తాము అధికారంలోకి వచ్చీ రాగానే.. కేంద్రం నుంచి విడుదలైన నిధులను ఇవ్వకపోతే.. ఇక గ్రామ పంచాయతీలను ఎలా నడపాలంటూ ప్రశ్నిస్తున్నారు. గ్రామాలను అభివృద్ధి చేయడం కోసం కొత్త పనులు ప్రారంభించకుండా కేవలం పెండింగ్ బకాయిలు తీర్చడానికే తాము కొత్తగా పదవుల్లోకి వచ్చామా అంటూ కొత్త సర్పంచ్‌లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
పెండింగ్ నిధుల్లో కేంద్రం కొంత మాత్రమే విడుదల చేయడం.. అందులో చాలా వరకు పాత బకాయిలు చెల్లించడానికే ఉపయోగించడం వల్ల.. గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, స్ట్రీట్ లైట్స్ వంటి అత్యవసర పనులు చేసేందుకు కూడా నిధులు లేకుండా పోతున్నాయని కొత్త సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని.. కేంద్రం నుంచి పెండింగ్‌లో ఉన్న మిగతా నిధులను కూడా త్వరగా విడుదలయ్యేలా చూడాలని తెలంగాణ గ్రామ సర్పంచుల సంఘం విజ్ఞప్తి చేస్తోంది.
నిధుల విషయంలో కొత్త, పాత సర్పంచ్‌ల విషయంలో ఈ ఉద్రిక్తత తలెత్తడంతో తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క స్పందించారు. గతంలో గ్రామాల్లో చేపట్టిన తాగునీరు, పారిశుద్ధ్య పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను.. తాజాగా విడుదలైన నిధుల నుంచి చెల్లించాలని మంత్రి సీతక్క స్పష్టం చేసింది. అదే సమయంలో పంచాయతీల్లో అందుబాటులో ఉన్న నిధుల్లో నుంచి గ్రామ పంచాయతీ సిబ్బందికి వేతనాలు ఇవ్వాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa