ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిజిటల్‌ అరెస్ట్‌‌తో రూ.1.66 కోట్లు టోకరా,,,రిటైర్డ్‌ జడ్జిని కూడా వదలని సైబర్ నేరగాళ్లు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 09, 2026, 06:12 PM

టెక్నాలజీని ఉపయోగించుకుని.. సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. రకరకాల మార్గాల్లో డబ్బులు లాగేసుకుంటూ.. కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. పోలీసులు.. సైబర్ నేరాలు ఎలా జరుగుతాయి, సైబర్ నేరగాళ్లను ఎలా గుర్తించాలి.. సైబర్ ఉచ్చులో చిక్కుకోకుండా ఎలా కాపాడుకోవాలి.. ఎవరైనా ఫోన్ చేసి బెదిరించి, డబ్బులు డిమాండ్ చేస్తే.. ఏం చేయాలి అనేది ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నప్పటికీ.. కొంతమంది మాత్రం మోసపోతూనే ఉన్నారు. ప్రస్తుతం డిజిటల్ అరెస్ట్ పేరుతో.. సైబర్ నేరగాళ్లు.. కోట్ల రూపాయలను దోచుకుంటున్నారు. అంతా అయిపోయిన తర్వాత బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు.


తాజాగా హైదరాబాద్‌లో ఓ రిటైర్డ్ జడ్జినే డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో మోసం చేసిన ఘటన ఆలస్యంగా బయటికి వచ్చింది. సైబర్ కేటుగాళ్లు తన నుంచి రూ.1.66 కోట్లు దోచుకున్నట్లు 73 ఏళ్ల విశ్రాంత న్యాయవాది మల్కాజ్‌గిరి పోలీసు కమిషనరేట్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సైబర్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నేరెడ్‌మెట్‌లో నివసించే ఆ రిటైర్డ్‌ జడ్జికి గత నెల 23వ తేదీన గుర్తు తెలియని నంబర్ నుంచి ఒక ఫోన్‌ కాల్‌ వచ్చింది. ఆ ఫోన్ మాట్లాడిన రిటైర్డ్ జడ్జికి.. అవతలి వ్యక్తి తాను ఒక సీనియర్‌ సీబీఐ అధికారి అని.. తన పేరు దీపక్‌ కుమార్‌ అని పరిచయం చేసుకున్నాడు. కానీ అతడు సైబర్ నేరగాడు కాగా.. దాన్ని ఆ రిటైర్డ్ జడ్జి గుర్తించలేకపోయారు.


ఆ రిటైర్డ్ జడ్జి ఆధార్‌ కార్డుతో లింక్ అయిన 2 మొబైల్‌ నంబర్‌లను ఉపయోగించి.. మహిళలకు అభ్యంతరకరమైన కాల్స్‌, మెసేజ్‌లు చేసేందుకు ఉపయోగిస్తున్నారని దీపక్ కుమార్ పేరుతో పరిచయం చేసుకున్న వ్యక్తి చెప్పాడు. ఈ వ్యవహారంపై కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఇందిరానగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదై ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదైందని భయపెట్టాడు. ఇక ఆ కాల్ నడుస్తుండగానే.. మరో సైబర్ నేరగాడు కాన్ఫరెన్స్‌లో చేరాడు. అతడు తాను సీఐ గౌరవ్‌ సారథి అని చెప్పాడు.


ఈ క్రమంలోనే మానవ అక్రమ రవాణా కేసులో రిటైర్డ్ జడ్జి నిందితుడిగా ఉన్నట్లు ఆ రెండో సైబర్ నేరగాడు చెప్పాడు. ఈ మేరకు సుప్రీంకోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసినట్లు కూడా చెప్పాడు. అయితే ఈ విషయాన్ని ఫ్రెండ్స్, ఫ్యామిలీ సహా ఎవరికీ చెప్పొద్దని సైబర్ నేరగాళ్లు హెచ్చరించారు. మానవ అక్రమ రవాణా, మనీలాండరింగ్, దొంగతనం కేసులు ఉన్నాయని బెదిరింపులకు దిగి.. బ్యాంక్ అకౌంట్ వివరాలను ఇవ్వాలని వారు డిమాండ్‌ చేశారు.


ఈ నేరాలపై విచారణ చేస్తామని.. ఆ తర్వాత డబ్బును తిరిగి ఇస్తామని చెప్పి ఆ రిటైర్డ్ జడ్జిని ఇద్దరు సైబర్ నేరగాళ్లు నమ్మబలికారు. ఈ కేసుల్లో తనను అరెస్ట్ చేస్తారని భయపడిన ఆ రిటైర్డ్ జడ్జి.. అలా జరిగితే ఇన్నేళ్లు తాను కాపాడుకున్న పరువు, ప్రతిష్ఠకు భంగం కలుగుతుందని భయపడి ఫిబ్రవరి 25వ తేదీ నుంచి మార్చి 2వ తేదీ మధ్య వారికి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేశాడు.


తన 3 బ్యాంకు అకౌంట్ల నుంచి మొత్తం 4 ట్రాన్సాక్షన్లలో రూ.1.66 కోట్లను సైబర్ మోసగాళ్లు చెప్పిన అకౌంట్లకు పంపించారు. అయితే విచారణ తర్వాత డబ్బులు ఇస్తామని వారు చెప్పి.. ఆ తర్వాత ఇవ్వకపోవడంతో తాను సైబర్ మోసానికి గురైనట్లు గ్రహించిన ఆ రిటైర్డ్ జడ్డి.. సైబర్ పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయం మొత్తం చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న సైబర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa