తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ క్రీడాశాఖపై సమీక్ష చేపట్టారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో సౌకర్యాల కల్పన.. అంతర్జాతీయ ప్రమాణాలతో అన్ని రకాల క్రీడలకు అనువుగా మైదానాల ఏర్పాటుపై సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఒలింపిక్స్, కామన్‌వెల్త్ గేమ్స్ లక్ష్యంగా తెలంగాణలోని క్రీడాకారులకు ట్రైనింగ్ ఇచ్చేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో క్రీడాశాఖపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు.
హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఔట్ డోర్ స్టేడియం పునరుద్ధరణతో పాటు ఇండోర్ స్టేడియం.. యూనివర్సిటీ కాంప్లెక్స్.. హాస్టల్ భవనాలు, అన్ని రకాల క్రీడా మైదానాలు.. శిక్షణకు అవసరమైన ఇతర సౌకర్యాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించిన నిర్మాణాల డిజైన్లను పరిశీలించి, పలు సూచనలు చేశారు.
ఒలింపిక్స్ వంటి అంతర్జాతీయ పోటీల్లో తెలంగాణ క్రీడాకారులు ప్రతిభ చూపించేలా వారికి సరైన శిక్షణ ఇవ్వాలని.. దానికి అవసరమైన అన్ని సౌకర్యాలతో స్పోర్ట్స్ వర్సిటీని రెడీ చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించి ప్రతిపాదిత నిర్మాణాల పలు ఆర్కిటెక్చర్ నమూనాలను సీఎం పరిశీలించారు.
భవిష్యత్తులో ఒలింపిక్స్, కామన్వెల్త్ వంటి ఇంటర్నేషనల్ మెగా ఈవెంట్లకు తెలంగాణ ఆతిథ్యం ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం రేవంత్ సూచించారు. ఒలింపిక్స్‌లో తెలంగాణ క్రీడాకారులు సత్తా చాటేలా వారిని తీర్చిదిద్దాలని ఆదేశించారు. భవిష్యత్ అవసరాల కోసం కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం.. ఎల్‍బీ స్టేడియం.. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలను ఆధునీకరించాలని పేర్కొన్నారు.
ఈ క్రీడాశాఖ సమీక్షలో మంత్రులు వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇటీవల ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేసి రాజ్యసభ అభ్యర్థిత్వం కోసం నామినేషన్ వేసిన వేం నరేందర్ రెడ్డి కూడా హాజరయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa