పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో సుప్రీంకోర్టు విచారణ ముగిసినట్లు ప్రకటించింది. ఈ వ్యవహారంలో అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారని తేల్చి చెప్పింది. ఈ కేసులో స్పీకర్ తరఫున లాయర్ చేసిన వాదనలతో సుప్రీంకోర్టు సంతృప్తి చెందింది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై బీఆర్ఎస్ పార్టీ స్పీకర్, సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ ఫిరాయింపుల పిటిషన్లపై విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు సుప్రీంకోర్టు గడువు విధించడంతో.. ఇటీవలె స్పీకర్ తన తుది నిర్ణయాన్ని వెల్లడించారు.
అయితే పార్టీ మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్‌చిట్ ఇవ్వడంతో.. ఆ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ.. తాజాగా మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పార్టీ ఫిరాయించిన తమ పార్టీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్‌ఎస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్లను సుదీర్ఘంగా విచారణ చేపట్టిన జస్టిస్ సంజయ్ కరోల్ నేపథ్యంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఇవాళ తుది తీర్పు ఇచ్చింది. సుప్రీంలో ఈ కేసు విచారణ సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తరఫున సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు.
పార్టీ ఫిరాయింపులు, ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి ఇప్పటికే దాఖలు చేసిన పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ జరిపారని.. వాటిపై తగిన నిర్ణయం తీసుకుని.. ఎమ్మెల్యేలకు క్లీన్‌చిట్ ఇచ్చిన విషయాన్ని లాయర్ అభిషేక్ మను సింఘ్వీ కోర్టుకు విన్నవించారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను తెలంగాణ స్పీకర్ కార్యాలయం పరిష్కరించినట్లు చెప్పారు. ఈ వ్యవహారంలో అభిషేక్ మను సింఘ్వీ చేసిన వాదనలతో జస్టిస్ సంజయ్ కరోల్ బెంచ్ ఏకీభవించింది.
ఈ వ్యవహారంలో ఇప్పటికే స్పీకర్ తుది నిర్ణయం తీసుకుని.. తన తీర్పును వెలువరించినందున.. ఇక ఈ పిటిషన్లపై విచారణ జరపాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ ముగిసినట్లు వెల్లడించింది. అదే సమయంలో తెలంగాణ స్పీకర్ తన తీర్పు కాపీలను.. ఫిర్యాదుదారులకు 2 రోజుల్లో ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa