ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెరపైకి ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు,,,మరోసారి కవితకు సీబీఐ నోటీసులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 12, 2026, 06:19 PM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మళ్లీ చట్టపరమైన చిక్కులు మొదలయ్యాయి. ఈ కేసులో కవిత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీశ్‌ సిసోదియా సహా 23 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సీబీఐ దాఖలు చేసిన అప్పీల్‌పై ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కాసేపటి క్రితం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లో ఉన్న కవిత నివాసానికి చేరుకున్న సీబీఐ అధికారులు.. ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన తాజా నోటీసులను అందజేశారు. ఆ సమయంలో కవిత ఇంట్లో అందుబాటులో లేకపోవడంతో.. నోటీసులను ఆమె భర్త అనిల్ కుమార్‌కు అందజేసి, ఆమె ఎక్కడ ఉన్నారనే వివరాలను ఆరా తీశారు. దీంతో ఈ కేసు మరోసారి తెరపైకి వచ్చింది.


  ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవకతవకలు జరిగాయని, 'సౌత్ గ్రూప్' తరపున కవిత కీలక పాత్ర పోషించారనే ఆరోపణలతో దర్యాప్తు సంస్థలు విచారణ జరిపాయి. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరి 27న ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. సీబీఐ దాఖలు చేసిన ఛార్జీషీట్‌లో సరైన ఆధారాలు లేవని పేర్కొంటూ కవితతో పాటు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా సహా 23 మందిని ఈ కేసు నుండి విముక్తి కల్పిస్తూ క్లీన్‌చిట్ ఇచ్చింది. అయితే, ఈ తీర్పును సీబీఐ హైకోర్టులో సవాలు చేయడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది.


మార్చి 15, 2024న హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించి, సాయంత్రం వేళ ఆమెను అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారు. తొలుత ఈడీ కస్టడీలో, ఆ తర్వాత సీబీఐ అరెస్ట్ చేయడంతో కవిత సుమారు ఐదున్నర నెలల పాటు తిహార్ జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రౌస్ అవెన్యూ కోర్టు తీర్పుతో ఊపిరి పీల్చుకున్న కవితకు.. సీబీఐ హైకోర్టును ఆశ్రయించడం కొత్త తలనొప్పిగా మారింది. ఛార్జిషీట్‌లో పేర్కొన్న ఆధారాలను మరోసారి పరిశీలించాలని, కింది కోర్టు తీర్పును రద్దు చేయాలని సీబీఐ పట్టుబడుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa