దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న జేఈఈ (జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్) పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. కొద్దిసేపటి కిందటే ఐఐటీ-బోంబే ఈ ఫలితాలను ప్రకటించింది. వాటిని jeeadv.ac.in. వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. విద్యార్థులు తమ స్కోర్ కార్డులను ఈ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే- ఫైనల్ ఆన్సర్ కీ పేపర్స్‌ను కూడా ఇందులో నుంచి తీసుకునే వెసలుబాటు ఉంది.
దేశవ్యాప్తంగా మొత్తంగా 1,55,538 మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్ 2022 పేపర్-1, పేపర్-2 పరీక్షలను రాశారు. వారిలో 40,712 మంది క్వాలిఫై అయ్యారు. అడ్వాన్స్డ్‌కు అర్హత సాధించిన విద్యార్థుల్లో 6,516 మంది యువతులు ఉన్నారు. రిజర్వేషన్ల పరంగా చూసుకుంటే.. జనరల్-88.41, ఆర్థికంగా వెనుకవడిన వర్గాలు (ఈడబ్ల్యూఎస్)-63.11, ఇతర వెనుకవడిన వర్గాలు-ఎన్సీఎల్-67, షెడ్యూల్డ్ కులాలు-43.08, షెడ్యూల్డ్ తరగతులు-26.7 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు.
టాప్ 10 ర్యాంకులను సాధించిన విద్యార్థుల జాబితాలో ఆర్ కే శిశిర్ అగ్రస్థానంలో ఉన్నారు. పోలు లక్ష్మీ సాయి లోహిత్ రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. థామస్ బిజు చీరంవెళిల్ మూడోస్థానాన్ని సాధించారు. వంగపల్లి సాయి సిద్ధార్థ్-4, మయాంక్ మొత్వాని-5, పోలిశెట్టి కార్తికేయ-6, ప్రతీక్ సాహు-7, ధీరజ్ కురుకుంద-8, మహిత్ గఢివాలా-9, వెచ్చ జ్ఞాన మహేష్-10వ స్థానంలో నిలిచారు. తొలి 10 మందిలో నలుగురు తెలుగువారే.
కాగా- ఫలితాలు వెల్లడైన వెంటనే jeeadv.ac.in. వెబ్‌సైట్ కొద్దిసేపు స్తంభించిపోయింది. లక్షలాది మంది విద్యార్థులు ఒకేసారి ఈ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయడానికి ప్రయత్నించడంతో సర్వర్ కొన్ని నిమిషాల పాటు పని చేయలేదు. అనంతరం యధాతథంగా కార్యకలాపాలు కొనసాగించింది. విద్యార్థులు తమ స్కోర్ కార్డ్‌ను జాగ్రత్తగా ఒకటికి రెండుసార్లు పరిశీలించుకోవాలి. అందులో ఎలాంటి ఎర్రర్స్ లేకుండా చూసుకోవాలి.
ఏదైనా ఎర్రర్ కనిపిస్తే- ఈ విషయాన్ని వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలి. పేరు, ఇతర వ్యక్తిగత వివరాలు, పరీక్ష రాసిన సెంటర్ పేరు అందులో పొందుపరిచి ఉందా లేదా అనేది పరిశీలించాలి. స్కోర్ లెక్కింపును సరి చూసుకోవాలి. అన్నింటికంటే ముఖ్యంగా తమ పేర్లల్లో స్పెల్లింగ్స్‌ను తప్పనిసరిగా సరి చూసుకోవాలి. వాటిల్లో ఏవైనా తప్పులు రికార్డయివుంటే వెంటనే అధికారులకు తెలియజేయాల్సి ఉంటుందని ఐఐటీ-బోంబే తెలిపింది.