యాషెస్ సిరీస్ రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ ఆటగాడు జానీ బెయిర్‌స్టో వివాదాస్పద స్టంపౌట్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. క్రికెట్‌ను ఎంతగానో అభిమానించే బ్రిటన్ ప్రధాని రిషి సునక్ (Rishi Sunak) సైతం దీనిపై స్పందించారు. బెయిర్‌స్టో విషయంలో ఆస్ట్రేలియా క్రికెట్ స్ఫూర్తిని విచ్ఛిన్నం చేసిందని ఆయన ఆరోపించారు. ‘ఈ వివాదంపై ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అభిప్రాయంతో సునాక్ ఏకీభవించారు.. ఆస్ట్రేలియా తరహాలో గెలవాలని తాను కోరుకోను’ రిషి సునాక్ అన్నట్టు ఆయన అధికార ప్రతినిధి వెల్లడించారు.
బెయిర్ స్టో ఔట్ విషయంలో ఆస్ట్రేలియా క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ఆసీస్ వ్యవహరించిందని సునాన్ నమ్ముతున్నారా? అని మీడియా ప్రశ్నించగా.. ఆయన ప్రతినిధి అవునని సమాధానం ఇచ్చారు. ఆసీస్ తీరుపై సునాక్ అసంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. అలాగే, రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ సెంచరీ చేయడం సునాక్ కూడా మెచ్చుకున్నారు. హెడ్డింగ్లీలో జరగబోయే మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లాండు జట్టు పుంజుకుని, పోటీలో నిలుస్తుందని నమ్మకంతో ఉన్నారని చెప్పారు.
‘బెన్ స్టోక్స్ ఆట అత్యుత్తమంగా చూసే అవకాశాన్ని అందించింది.. ఇది అద్భుతమైన టెస్ట్ మ్యాచ్. హెడింగ్లీ (మూడో టెస్టులో)లో ఇంగ్లండ్ తిరిగి పుంజుకుంటుందన్న విశ్వాసం సునాక్‌కు ఉంది’ అని వ్యాఖ్యానించారు. ఇక, ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్ 0-2 తో వెనుకబడి ఉన్న విషయం తెలిసిందే. ఒకవేళ మూడో టెస్ట్‌లో ఇంగ్లాండ్ ఓడిపోతే యాషెస్ సిరీస్ ఆస్ట్రేలియా సొంతమవుతుంది. అయితే, యాషెస్ సిరీస్ రెండో టెస్ట్ చివరి రోజు ఆటలో బెయిర్‌స్టో నిర్లక్ష్యంగా వ్యవహరించి ఔటైన విషయం తెలిసిందే. బంతి వికెట్ కీపర్ చేతిలో ఉండగానే ఓవర్ పూర్తయ్యిందనుకుని బెయిర్‌స్టో క్రీజ్ దాటి వెళ్లాడు. వెంటనే వికెట్‌కీపర్ వికెట్లను గిరాటు వేశాడు. సుదీర్ఘ పరిశీలన అనంతరం ధర్డ్ అంపైర్ బెయిర్‌స్టోను స్టంపౌట్‌గా ప్రకటించడంతో వివాదం రాజుకుంది.
క్రికెట్ నిబంధనల ప్రకారం ఇది ఔటే అయినా.. ఆసీస్ ఆటగాళ్లు వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆస్ట్రేలియా జట్టు క్రీడాస్పూర్తికి విరుద్ధంగా ప్రవర్తించిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇంగ్లండ్ కెప్టెన్ అయితే తాము ఆసీస్ తరహాలో మ్యాచ్ గెలవాలని ఎప్పటికీ కోరుకోమని వ్యాఖ్యానించాడు. తాజాగా, ఇదే విషయాన్ని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కూడా వెలిబుచ్చారు. కాగా, ఇంగ్లండ్, ఆసీస్ మధ్య మూడో టెస్ట్ జులై 6 నుంచి హెడింగ్లీలో ప్రారంభమవుతుంది.
ఇదిలా ఉంటే, రెండో టెస్ట్‌లో బెయిర్‌స్టో కీలక సమయంలో ఔట్ కావడంతో ఇంగ్లండ్ 43 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఫలితంగా ఆసీస్ 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇంగ్లండ్, ఆసీస్ మధ్య మూడో టెస్ట్ జులై 6 నుంచి హెడింగ్లీలో ప్రారంభమవుతుంది. మరోవైపు, ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ తమ జట్టు విజయంపై మాట్లాడారు. యాషెస్ ప్రారంభ మ్యాచ్‌లలో పురుషులు, మహిళల క్రికెట్ జట్లు గెలిచినందుకు గర్వపడుతున్నానని అన్నారు. ‘అదే పాత ఆసీస్ -- ఎల్లప్పుడూ గెలుస్తుంది!.. విజయంతో వచ్చే టీమ్‌కు స్వాగతం పలకడానికి ఎదురు చూస్తున్నాను’ అని పేర్కొన్నారు.