108 వాహనాల టెండర్, నిర్వహణకు సంబంధించి అరబిందో సంస్థపై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ సాక్షిగా ఏపీ ప్రభుత్వాన్ని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరారు. 108 మాటున ఎంపీ విజయసాయి రెడ్డి అల్లుడికి చెందిన అరబిందో సంస్థ భారీ అక్రమాలకు పాల్పడిందని అసెంబ్లీలో సోమిరెడ్డి ఆధారాలు బయటపెట్టారు. గత వైసీపీ ప్రభుత్వంలో దాదాపు 18 లక్షల మందికి అంబులెన్స్‌లు అత్యవసర సేవలు అందించలేకపోయాయని ఎమ్మెల్యే వెల్లడించారు. 34 లక్షల మందికి గాను 17.8 లక్షల మందికి గోల్డన్ అవర్ రీచ్ కాలేకపోయాయని ఆడిట్ జనరల్ తప్పుపట్టిన విషయాన్ని సభలో ఆయన చెప్పారు. 61 శాతం అంబులెన్స్‌లో సెలైన్ల కొరత ఉండటంతోపాటు ఫస్ట్ ఎయిడ్ కొరతా ఉన్నట్లు కాగ్ నిర్ధారించిందని అసెంబ్లీలో సోమిరెడ్డి ఆధారాలు బయటపెట్టారు. అరబిందో 430 అంబులెన్స్‌లు నడిపి 720 అన్నట్లు ప్రభుత్వానికి లెక్కలు చూపిందని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర వెల్లడించారు. గత ప్రభుత్వంలో అంబులెన్స్‌లు నిర్వహించిన వారికి చట్టాలు వర్తించవా? అంటూ ఆయన ప్రశ్నించారు.
ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడిన ఆ సంస్థపై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ సాక్షిగా నరేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అయితే అరబిందో సంస్థపై శాసనసభలో సభ్యులు చేసిన వ్యాఖ్యలపై ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి స్పందించారు. ఎమ్మెల్యేలు సోమిరెడ్డి, ధూళిపాళ్ల చేసిన ఆరోపణలు వాస్తవమేనని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటివరకూ అరబిందోకు రూ.600 కోట్ల చెల్లింపులు జరిగాయని, ఇంకా రూ.800 కోట్లు పైచిలుకు చెల్లింపులు చేయాల్సి ఉందని మంత్రి వెల్లడించారు. అంబులెన్స్‌ల విషయంలో నిర్లక్ష్యంతోపాటు దోపిడీ కూడా జరిగిందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అభిప్రాయపడ్డారు. దీనిపై ఏం చర్యలు తీసుకుంటున్నారో సభకు, ప్రజలకు తెలిజేయాలని ఆయన ఏపీ ప్రభుత్వాన్ని అడిగారు. ఈ సందర్భంగా జరిగిన చర్చ ఆసక్తిని రేకెత్తించింది.