ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాలని భావిస్తున్న టీడీపీ కూటమి సర్కారు.. ఆ దిశగా కీలక అడుగులు వేస్తోంది. అమరావతి నిర్మాణం కోసం కేంద్రం నుంచి రూ.15000 కోట్లు సాయం సాధించుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రాజధాని నిర్మాణ పనులలో వేగం పెంచింది. త్వరలోనే రాజధాని నిర్మాణ పనుల కోసం టెండర్లు పిలవనున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్నం అమరావతి నిర్మాణంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. నాలుగు ప్రధాన నగరాలను కలిపి మెగా సిటీగా తీర్చిదిద్దాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా విజయవాడ, గుంటూరు, మంగళగిరి, అమరావతిని కలిపి మెగా సిటీగా అభివృద్ధి చేయాలని ప్లాన్ చేస్తోంది.వచ్చే పాతికేళ్లలో ఈ నగరాలను అనుసంధానం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది.
ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే రియల్ ఎస్టేట్ కీలకమని సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అనుకున్నట్లు మెగా సిటీ ఏర్పాటైతే ఈ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు రానున్నాయి. ఇప్పటికే గుంటూరు, విజయవాడ మధ్య భూములకు భారీగా డిమాండ్ ఉంది. ఈ ప్రాంతంలో భూముల రేట్లు చుక్కలను అంటుతున్నాయి. వీటికి మంగళగిరి, అమరావతిని కూడా అనుసంధానిస్తే రియల్ ఎస్టేట్ రంగం మరింత దూసుకుపోతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. అలాగే మెగా సిటీ నిర్మాణం దిశగా అడుగులు వేస్తే మరిన్ని ప్రాజెక్టులు ఏపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు, అమరావతి రైల్వే లైన్ ప్రాజెక్టుకు కూడా కేంద్రం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో అనుసంధానం కూడా మరింత ఈజీ కానుంది. అలాగే అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు వెళ్లే ప్రాంతాల్లోనూ భూములకు డిమాండ్ రానుంది.
మరోవైపు అమరావతి రాజధాని నిర్మాణం కోసం త్వరలోనే టెండర్లు పిలవనున్నారు. వీలైనంత త్వరగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి నిర్మాణ పనులు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా 360 కి.మీ.ట్రంక్ రోడ్లు నిర్మించనున్నారు. అమరావతికి వరద ముప్పు లేకుండా ఉండేలా రిజర్వాయర్లు, కాలువల నిర్మాణం చేపట్టనున్నారు. మరోవైపు రాజధాని నిర్మాణంలోని సింగపూర్‌ను మళ్లీ తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ దిశగా ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది.