2019లో రైల్వేశాఖ ప్రవేశపెట్టిన వందే భారత్ రైళ్లు.. సాధారణ రైళ్లతో పోల్చితే టికెట్ ధర కాస్త ఎక్కువే అయినా రైలు ప్రయాణికులకు మాత్రం వేగం, సుఖవంతమైన ప్రయాణాన్ని అందిస్తోంది. ఇక ఈ సెమీ హెస్పీడ్ రైళ్లు ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ నగరాల మధ్య భారీ సంఖ్యలో అందుబాటులోకి వచ్చాయి. రైలు ప్రయాణికుల నుంచి ఈ వందే భారత్ రైళ్లకు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలోనే వందే భారత్ స్లీపర్ రైళ్లను నడపాలని యోచించిన రైల్వే శాఖ వచ్చే ఏడాది వాటిని అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే అందుబాటులోకి వచ్చి ప్రజాదరణ పొందిన వందే భారత్ రైళ్లతో పోల్చితే ఈ వందే భారత్ స్లీపర్ రైళ్లు మరిన్ని సౌకర్యాలు కలిగి ఉంటాయని ఇప్పటికే రైల్వే అధికారులు వెల్లడించారు.
ఇక ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న వందే భారత్ స్లీపర్ రైళ్లకు సంబంధించి త్వరలోనే ట్రయల్ రన్ నిర్వహించాలని రైల్వే శాఖ యోచిస్తోంది. ఇక 2025-26 మధ్య నాటికి మన దేశంలో ఒకేసారి 10 వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రారంభించేందుకు రైల్వేశాఖ సన్నాహాలు ప్రారంభించింది. ప్రపంచ స్థాయి సౌకర్యాలు, అత్యాధునిక డిజైన్‌తో రూపొందిన ఈ వందే భారత్ స్లీపర్ రైళ్లు సుదూర ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికుల కోసం అందుబాటులోకి రానున్నాయి. మన దేశంలోనే తొలి వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ రన్‌ను నవంబర్ 15వ తేదీ నుంచి 2 నెలల పాటు నిర్వహించనున్నట్లు రైల్వే వర్గాలు వెల్లడించాయి.
2 నెలల పాటు విజయవంతంగా ట్రయల్ రన్ పూర్తయిన తర్వాత 2025లో ఈ వందే భారత్ స్లీపర్ రైళ్లను పట్టాలు ఎక్కించే అవకాశం ఉంది. చెన్నైకి చెందిన ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ సుబ్బారావు ఈ విషయాన్ని వెల్లడించారు. 2 నెలల పాటు రైళ్ల ఆసిలేషన్ ట్రయల్స్‌తో పాటు ఇతర టెస్ట్‌లు చేస్తామని.. ఆ తర్వాత కమర్షియల్ సర్వీస్‌లోకి తీసుకురానున్నట్లు తెలిపారు.
ఈ వందే భారత్ స్లీపర్ రైళ్లను ఆస్తెనిటిక్ స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారుచేశారు. క్రాష్ బఫర్, ప్రత్యేకంగా రూపొందించిన కప్లర్‌ల వంటి అత్యాధునిక భద్రతా పరికరాలతో ఈ రైలును నిర్మించారు. ఇక అత్యవసర పరిస్థితుల్లో రైలులోని ప్రయాణికులను సురక్షితంగా ఉంచేలా రూపొందించారు. ఈ స్లీపర్ రైలులో మొత్తం 16 కోచ్‌లు ఉంటాయి. ఇందులో ఒకేసారి 823 మంది ప్రయాణికులు ప్రయాణించేందుకు వీలు ఉంటుంది. ఫస్ట్ క్లాస్ ఏసీ, సెకండ్ క్లాస్ ఏసీ, థర్డ్ క్లాస్ ఏసీ వంటి కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. ఇక గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ఈ వందే భారత్ స్లీపర్ రైలు పరుగులు పెట్టనుంది.
2025-26 ఏడాదిలో 10 వందే భారత్ స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రైల్వే శాఖ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈ 10 రైళ్లను ఏ ఏ రూట్లలో నడుపుతారు అనేది ఇంకా ఖరారు చేయలేదు. కానీ న్యూఢిల్లీ – పూణే, న్యూఢిల్లీ – శ్రీనగర్ తదితర మార్గాల్లో మొదట ఈ వందే భారత్ స్లీపర్ రైళ్లను నడిపేందుకు రైల్వేశాఖ ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది.