మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ఆయన భార్య భారతి, వైసీపీ నేతలపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నారంటూ మాజీ మంత్రి రోజా తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమ పార్టీ నేతలు, మహిళలను కించపరిచేలా కొంత మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని రోజా ఫిర్యాదులో పేర్కొన్నారు. తప్పు చేయని తమ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు పెడుతూ వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. రోజాతోపాటు మాజీ ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి, నారాయణస్వామి, వైసీపీ శ్రేణులు ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి రోజా మాట్లాడుతూ.. "వైసీపీ అధినేత జగన్, ఆయన సతీమణి భారతిపై సోషల్ మీడియాలో నీచాతినీచంగా పోస్టులు పెడుతున్నారు. ఫిర్యాదు చేసేందుకు వస్తే ఫిర్యాదు స్వీకరించినట్లు రసీదు ఇవ్వటానికి పోలీసులు నానా హైరానా పడుతున్నారు. కూటమిలోని మూడు పార్టీలకు పోలీసులు సెల్యూట్ చేయవద్దు, మూడు సింహాలకు సెల్యూట్ కొట్టి న్యాయం చేయండి. ఏపీలో హిట్లర్, గడాఫి కలిసి పాలన చేస్తున్నట్లు పరిస్థితులు ఉన్నాయి. పెద్దపెద్ద నియంతలే కాలగర్భంలో కలిసిపోయారు. వైసీపీ హయాంలో ఐటీడీపీ నీచపు పోస్టులు పెట్టింది. ప్రస్తుతం ఏ తప్పూ చేయని వారిపై కేసులు పెడుతూ వేధిస్తున్నారు.వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై పోలీసులు దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో వేల మంది మహిళలు, యువతీయువకులు అదృశ్యమయ్యారని తప్పుడు ప్రచారం చేశారు. అసెంబ్లీ వేదికగా నిజనిజాలు బయటకు వచ్చాయి. 36 మందే అదృశ్యమైనట్లు అసెంబ్లీ సాక్షిగా హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. మరి మీ పాలనలో అదృశ్యమైన మహిళల ఆచూకీ కోసం ఎన్డీయే ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటో ప్రజలకు వెల్లడించాలి. ఆంధ్రప్రదేశ్‌లో సీఎం చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. తప్పు చేయని వారిపై కేసులు మోపుతూ వ్యక్తిత్వ హననానికి ఆయన పాల్పడుతున్నారు. వారు తప్పు చేస్తూ ఎదువారిపై నిందలు మోపే ప్రయత్నం చేస్తున్నారు. మహిళలపై సోషల్ మీడియా వేదికగా కొంతమంది నీచంగా పోస్టులు పెడుతున్నారు. మా పార్టీ నేతలనూ వారు వదిలిపెట్టడం లేదు. మేము ఫిర్యాదు చేసి కంప్లైట్ కాపీని అడిగితే పోలీసులు వందసార్లు ఆలోచించారు. ఒక్క కాపీ ఇచ్చేందుకు మీనమేషాలు లెక్కపెడుతూ ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వానికి కాదు.. మీ టోపీపై ఉన్న మూడు సింహాలకు సెల్యూట్ చేయండి" అంటూ మండిపడ్డారు.