మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు అరికట్టడంలో పదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విఫలం అవుతోందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు. గడిచిన పదేళ్లల్లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2 లక్షల కేసులు నమోదు అయ్యాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని ఆమె మండిపడ్డారు. శాసన మండలిలో ఇవాళ జరిగిన చర్చే ఇందుకు నిదర్శనమని షర్మిల అన్నారు.పదేళ్లుగా మహిళలకు రక్షణ కల్పించడంలో టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు పూర్తిగా విఫలం అయ్యాయని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో 2014 -19 మధ్య మహిళలపై దాడులు జరిగిన ఘటనల్లో 83,202 కేసులు, 2019 -24 మధ్య 1,00,508 కేసులు నమోదు అయ్యాయని శాసన మండలి సాక్షిగా ప్రజాప్రతినిధులే చెబుతున్నారని ఆమె అన్నారు.
తమ పాలనలో కంటే వైసీపీ హయాంలోనే 20 శాతం ఎక్కువ కేసులు నమోదయ్యాయని టీడీపీ నేతలు చెబుతుంటే.. లేదు లేదు కూటమి అధికారం చేపట్టిన తర్వాతే రోజుకు సగటున 59 అత్యాచారాలు జరుగుతున్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారని షర్మిల చెప్పుకొచ్చారు.కూటమి, వైసీపీ నేతలు మహిళల మానప్రాణాల మీద రాజకీయాలు చేస్తున్నారని షర్మిల ధ్వజమెత్తారు. గడిచిన పదేళ్లల్లో 2 లక్షల కేసులు నమోదు అయ్యాయంటే మహిళలకు రక్షణ ఉందా? అంటూ ఆమె ప్రశ్నించారు. ఆడవాళ్లకు భద్రత కల్పించడంలో ఏపీ రాష్ట్రం ఎక్కడుందో అర్థమవుతోందని మండిపడ్డారు. మహిళలపై నేరాలు అరికట్టలేని వైసీపీ, టీడీపీలు దొందూ.. దొందేనని షర్మిల అన్నారు. ఇది నిజంగా సిగ్గుపడాల్సిన విషయమని చెప్పారు. నిర్భయ, దిశ లాంటి చట్టాలు పేరుకే తప్ప అమలుకు నోచుకోలేదని ఆమె ఆరోపించారు. చట్టాలను అమలు చేసిన దాఖలాలు ఎక్కడా కనిపించలేదంటూ ధ్వజమెత్తారు. మహిళల భద్రతకు పెద్దపీట అని ఆర్భాటపు ప్రచారాలు తప్ప..10 ఏళ్లలో ఏ ఒక్క నేరస్థుడికీ కఠిన శిక్ష పడలేదని షర్మిల విమర్శించారు. కేసులు ఛేదించాల్సిన పోలీసులను కక్ష్యసాధింపు రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆమె ఆరోపించారు. పోలీసులను ఈ రెండు పార్టీలు ఏనాడూ వారి విధులు నిర్వర్తింపజేయనివ్వలేదని మండిపడ్డారు. ఏపీని అభివృద్ధిలో చివరిస్థానంలో, మాదక ద్రవ్యాల వాడకం, మహిళలపై అఘాయిత్యాలలో ప్రథమ స్థానంలో నిలిపారని ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆగ్రహించారు.