కొవ్వులు అధిక కేలరీలను కలిగి ఉంటాయి. విటమిన్లు, ఖనిజాలను గ్రహించి కణాల నిర్మాణానికి దోహదపడతాయి. మెదడు, గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. ముఖ్యమైన విధులను నిర్వహించడానికి మన శరీరానికి శక్తిని అందిస్తాయి.కొవ్వులు క్యాలరీలు ఎక్కువగా ఉండటం వల్ల అవి మంచివి కావు అనే అపోహ ప్రజల్లో ఉంది. అయితే మన ఆహారంలో ఆరోగ్యకరమైన కొవ్వులను చేర్చుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని బ్యాలెన్స్ చేస్తాయి. గుండె జబ్బులు, మధుమేహ ముప్పును తగ్గిస్తాయి. అంతేకాకుండా శక్తివంతమైన యాంటీ ఇన్‌ఫ్లామేటరీలు కలిగి ఉంటాయి. ఫలితంగా ఆర్థరైటిస్, క్యాన్సర్, అల్జీమర్స్ వచ్చే ప్రమాదాన్ని నివారిస్తాయి. మన రోజువారీ కేలరీలలో 20 నుండి 40 శాతం కొవ్వు నుండి వస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. అన్ శాచ్యురేటెడ్ ఫ్యాట్ ఉన్న పదార్థాలు శరీరానికి చక్కటి ఆరోగ్యాన్నిస్తాయి. అవి నట్స్(వేరు శనగ, బాదం, పిస్తా, జీడి పప్పు), ఆలివ్ నూనె, గుడ్లు, వేరుశెనగ, వెన్న, చీజ్, అవకాడోలలో లభిస్తాయి.