ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మళ్లీ పడిపోయిన అదానీ.. 4 రోజుల్లోనే సీన్ రివర్స్.. ఆసియాలో అత్యంత ధనవంతుడిగా అంబానీ

business |  Suryaa Desk  | Published : Wed, Jan 10, 2024, 09:21 PM

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తిరిగి భారత్ సహా ఆసియాలో అత్యంత కుబేరుడిగా నిలిచారు. చాలా రోజుల తర్వాత అంబానీని అధిగమించి ఇటీవల అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ మొదటి స్థానానికి చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ పడిపోయారు. గత కొద్ది రోజులుగా దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా నష్టపోయిన క్రమంలో అదానీ కంపెనీల షేర్లు కూడా పతనమయ్యాయి. దీంతో మళ్లీ అంబానీ పుంజుకున్నారు. ప్రస్తుతం బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. ముకేశ్ అంబానీ 96.6 బిలియన్ డాలర్ల సంపదతో (భారత కరెన్సీలో రూ. 8 లక్షల కోట్లకుపైనే) ప్రపంచంలోనే 12వ స్థానంలో ఉన్నారు. భారత్‌లో అత్యంత ధనవంతుడిగా ఉన్నారు. ఇక గౌతమ్ అదానీ సంపద ప్రస్తుతం 95 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది భారత కరెన్సీలో సుమారు రూ. 7.8 లక్షల కోట్లకుపైనే ఉంది. ఇదే ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ లిస్ట్ చూస్తే అంబానీ 102.5 బిలియన్ డాలర్లతో 11వ స్థానంలో, 79.8 బిలియన్ డాలర్లతో అదానీ 16వ స్థానంలో ఉన్నారు.


గతేడాది అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్‌పై సంచలన ఆరోపణలు చేసింది. ఈ కారణాలతో అదానీ గ్రూప్‌కు చెందిన చాలా స్టాక్స్ దారుణంగా పడిపోయాయి. దాదాపు సగానికిపైగా అదానీ సంపద పతనమైంది. మార్కెట్ క్యాప్ 150 బిలియన్ డాలర్లకుపైగా పడిపోయింది. తదనంతరం.. దీనిపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ విచారణ జరుపుతోంది. ఇటీవల సెబీ విచారణను మినహాయించి వేరే దర్యాప్తు అవసరం లేదని సుప్రీం కోర్టు.. సెబీకి మరో 3 నెలల గడువు ఇచ్చింది. అంతకుముందు ఈ రిపోర్టుల్ని ప్రాతిపదికగా తీసుకొని వాస్తవాలుగా పరిగణించలేమని కూడా సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. అదానీ గ్రూప్ అవకతవకలకు పాల్పడినట్లు కూడా ఎలాంటి ఆధారాలు కనిపించలేదని గతంలోనే సెబీ పేర్కొంది. ఇవన్నీ అదానీ గ్రూప్ స్టాక్స్ తిరిగి పుంజుకునేందుకు దోహదం చేశాయి. దీంతో 5 రోజుల కిందట అంబానీని దాటేసి మొదటి స్థానానికి చేరారు అదానీ. ఇద్దరి మధ్య సంపదలో పెద్ద వ్యత్యాసం ఏం లేదు. స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లో ఉన్న కారణంతో అదానీ సంపద మళ్లీ తగ్గింది. మళ్లీ కిందికి పడిపోయారు. ఇవాళ మాత్రం అదానీ గ్రూప్ స్టాక్స్ మళ్లీ పుంజుకున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com