డీమార్ట్.. ప్రజల్లో ఎంతో ఆదరణ పొందిన రిటైల్ సూపర్‌మార్కెట్ అని చెప్పొచ్చు. దీంట్లో ఉప్పు, పప్పూ సహా అన్ని రకాల వంట సామగ్రి, తినే చాక్లెట్లు, బిస్కెట్లు, స్వీట్లు, ఫర్నీచర్, స్టీల్ సామాను, దుస్తులు, పూజా సామగ్రి ఇలా ఏదైనా లభ్యం అవుతుందన్న సంగతి తెలిసిందే. విస్తృత శ్రేణి ప్రొడక్ట్స్.. అందుబాటు ధరలకే లభిస్తాయి. దీంతో అన్నీ ఒకేచోట ఉండటం వల్ల నిత్యం జనం తాకిడి ఎక్కువగానే ఉంటుందని చెప్పొచ్చు. వారానికి సరిపడా, నెలకు సరిపడా లేదా 3 నెలలకు సరిపడా సామాన్లు తెచ్చుకుంటుంటారు. ఇలా మంచి డిమాండ్ కారణంగా లాభాలు కూడా అలాగే వస్తుంటాయి. డీమార్ట్‌ను అవెన్యూ సూపర్‌మార్ట్స్ నిర్వహిస్తుంటుంది.
ఈ డీమార్ట్ ఇప్పుడు జనవరి 13న ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం ఫలితాల్ని ప్రకటించింది. లాభాలు, ఆదాయాలు భారీగా వచ్చాయి. ఏకీకృత ప్రాతిపదికన నికర లాభం రూ. 690.41 కోట్లుగా నమోదైంది. ఏడాది కిందట ఇదే త్రైమాసికంలో రూ. 589.64 కోట్లుగా ఉండగా.. ఇప్పుడు 17 శాతానికిపైగా పెరగడం విశేషం. ఇదే సమయంలో నికర ఆదాయం కూడా భారీగా పెరిగింది. 2022 డిసెంబర్ త్రైమాసికంలో ఏకీకృత నికర ఆదాయం ఆపరేషన్స్ నుంచి రూ. 11,569.05 కోట్లుగా ఉండగా.. ఇప్పుడు 17.31 శాతం పెరిగి రూ. 13,572.47 కోట్లు వచ్చింది. ప్రస్తుతం పండగ సీజన్‌లో ఊహించిన దాని కంటే తక్కువ సేల్స్ వచ్చాయని చెప్పారు సీఈఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నెవిల్లే నొరోన్హా.
ఇక అవెన్యూ సూపర్‌మార్ట్స్ ప్రస్తుత మూడో త్రైమాసికంలో కొత్తగా 5 డీమార్ట్ స్టోర్లు తెరిచింది. దీంతో ఇప్పుడు కంపెనీ మొత్తం స్టోర్ల సంఖ్య 341కి చేరింది. డీమార్ట్ ఫౌండర్ రాధాకిషన్ దమానీ. ఈయన, ఈయన కుటుంబంతో కలిసి డీమార్ట్ స్టోర్లు నిర్వహిస్తుంటుంది. గుజరాత్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, మధ్యప్రదశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, NCR, పంజాబ్, తమిళనాడు, రాజస్థాన్ రాష్ట్రాల్లో ప్రధాన వ్యాపారాలు ఉన్నాయి. ఇక డీమార్ట్ షేరు ప్రస్తుతం రూ. 3843 వద్ద ఉంది. 52 వారాల గరిష్ట విలువ రూ. 4206 కాగా.. కనిష్ట విలువ 3,292. దీని మార్కెట్ క్యాప్ రూ. 2.50 లక్షల కోట్లుగా ఉంది.