భారత ప్రముఖ ఐటీ కంపెనీలు ప్రస్తుతం మూడో త్రైమాసికం (అక్టోబర్- డిసెంబర్) ఫలితాల్ని ప్రకటిస్తున్నాయి. లాభాలు, ఆదాయాలు అంతంతమాత్రంగానే వస్తున్నప్పటికీ.. ఇది ప్రస్తుతం ఆర్థిక మందగమనం సమయంలో మంచిగానే నమోదవుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. దేశీయ అతిపెద్ద ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) నికర లాభం పెరిగింది. ఆదాయం అంచనాల్ని మించి నమోదైంది. ఇక ఇన్ఫోసిస్ లాభం మాత్రం పడిపోయింది. విప్రో లాభం కూడా భారీగా క్షీణించింది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ లాభాలు మాత్రం పెరిగాయి. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు సహా డిమాండ్ తగ్గడం వల్ల ఇలాంటి ఫలితాలు వస్తున్నాయి.
అయితే ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లోనూ దిగ్గజ ఐటీ కంపెనీ టీసీఎస్ కీలక ప్రకటన చేసింది. ఉద్యోగులకు శుభవార్త అందించింది. 70 శాతం మంది ఉద్యోగులకు ఈ మూడో త్రైమాసికానికి సంబంధించి 100 శాతం వేరియబుల్ పే చెల్లించనున్నట్లు ప్రకటించింది. దీంట్లో జూనియర్ నుంచి మొదలుకొని మిడ్ లెవెల్ ఉద్యోగులు ఉన్నారు. ఇక మిగతా ఉద్యోగులకు వేరియబుల్ పే అనేది బిజినెస్ రిలేటెడ్ పెర్ఫామెన్స్ ఆధారంగా చెల్లించనున్నట్లు చెప్పారు టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రీసోర్సెస్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్. ఎప్పటిలానే ఈసారి కూడా 100 శాతం వేరియబుల్ పే కు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు లక్కడ్. టీసీఎస్ ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం, రెండో త్రైమాసికంలో కూడా పూర్తిగా వేరియబుల్ పే చెల్లించింది. ఈ సమయంలో విప్రో, ఇన్ఫోసిస్, వంటి సంస్థలో క్యూ2లో కేవలం 80 శాతం వేరియబుల్ పే మాత్రమే చెల్లించాయి.
టీసీఎస్ వంటి కంపెనీలో క్యూ2 లో 5680 మంది ఉద్యోగులు తగ్గడం.. ఐటీ ఉద్యోగులు సహా ఐటీ రంగంలో ఆందోళనలకు కారణం అవుతోంది. అట్రిషన్ రేటు వరుసగా తగ్గుతున్నప్పటికీ.. ఇలా వరుస త్రైమాసికాల్లో ఉద్యోగుల సంఖ్య తగ్గడం షాక్ ఇస్తోంది. జనవరి 11న టీసీఎస్ కంపెనీ క్యూ3 ఫలితాల్ని ప్రకటించగా.. నికర లాభం 2 శాతం పెరిగి రూ. 11,058 కోట్లుగా నమోదైంది. ఏకీకృత ప్రాతిపదికన నికర ఆదాయం 4 శాతం పుంజుకొని రూ. 60,583 కోట్లుగా ఉంది.
టీసీఎస్ సహా ఇన్ఫోసిస్, విప్రోలోనూ ఉద్యోగుల సంఖ్య వరుస త్రైమాసికాల్లో తగ్గుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఒక్క హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌లో మాత్రమే ఉద్యోగుల సంఖ్య పెరిగింది. గత 3 త్రైమాసికాల్లో చూస్తే ఈ 4 కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య 50 వేలకుపైగా తగ్గింది. కేవలం హెచ్సీఎల్ ఈ 9 నెలల్లో 9 వేల మంది వరకు కొత్త ఉద్యోగుల్ని చేర్చుకుంది.