ఏదైనా అవసరం ఏర్పడినప్పుడు ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ నుంచి నగదు విత్ డ్రా చేసుకునేందుకు ఉద్యోగులకు అవకాశం ఉంటుంది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఫ్ఓ నిబంధనలకు లోబడి ఈ నగదు ఉపసంహరణ చేయొచ్చు. అయితే, కొన్ని సార్లు చేసే చిన్న చిన్న పొరపాట్లతో పీఎఫ్ విత్ డ్రా క్లెయిమ్ ను ఈపీఎఫ్ రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇలా మీకూ ఎదురైనట్లయితే అసలు పీఎఫ్ విత్ డ్రా క్లెయిమ్ రిజెక్ట్ అయ్యేందుకు కారణాలేంటి? వాటిని ఎలా సవరించుకోవాలి అనేది తెలుసుకుందాం.
మీ ఈపీఎఫ్ క్లెయిమ్ రిజక్ట్ అవ్వడానికి.. సరైన కేవైసీ పత్రాలను సమర్పించకపోవడం ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. కేవైసీ వివరాలు అసంపూర్తిగా, సరిగా లేకపోయినా మీ క్లెయిమ్ను ఈపీఎఫ్ఓ తిరస్కరిస్తుంది. పీఎఫ్ విత్ డ్రా క్లెయిమ్ రిజెక్ట్ అయ్యేందుకు గల కారణాల్లో యూఏఎన్ అకౌంట్‌ని ఆధార్‌కి లింక్ చేయకపోవడం మరొకటి. ఆధార్ నంబర్‌ను ఈపీఎఫ్ఓ యూఏఎన్ తో లింక్ చేయకపోతే క్లెయిమ్ రిజెక్ట్ అవుతుందని గుర్తుంచుకోవాలి. మరోవైపు.. ఈపీఎఫ్ఓ నుంచి పీఎఫ్ డబ్బులు విత్ డ్రా క్లెయిమ్ చేయాలంటే కనీసం 6 నెలల పాటు ఉద్యోగం చేసి ఉండాలి. దీంతో పాటు సరైన విత్ డ్రా ఫామ్ ఎంచుకోకపోతే పీఎఫ్ క్లెయిమ్ రిజక్ట్ అవుతుంది. అలాగే మీరు పీఎఫ్ నగదు విత్ డ్రా కోసం క్లెయిమ్ చేస్తున్నప్పుడు ఇచ్చిన వివరాలు.. ఈపీఎఫ్ డేటాబేస్‌లోని వివరాలతో మ్యాచ్ కావాల్సి ఉంటుంది. ఏ చిన్న తేడా వచ్చినా.. మీ క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది.
మరోవైపు.. మీ డేట్ ఆఫ్ బర్త్ సరిపోలకపోయినా కూడా ఈపీఎఫ్ మీ క్లెయిమ్ తిరస్కరిస్తుంది. అందుకే ఆధార్‌లో ఉన్నట్లుగా మీ డేట్ ఆఫ్ బర్త్ను ముందే అప్‌డేట్ చేసుకోవాలి. మీ బ్యాంక్ ఖాతా వివరాలూ సరిగా ఉండాలి. వీటిల్లో ముఖ్యంగా బ్యాంక్ ఖాతా నంబర్, ఐఎఫ్ఎస్‌సీ కోడ్, బ్యాంక్ పేరు, బ్రాంచ్ వివరాలు చూసుకోవాలి. బ్యాంకుల విలీనం కారణంగా వాటి పేరు లేదా ఐఎఫ్ఎస్సీ కోడ్ లో మార్పులు వచ్చాయి. క్లెయిమ్ చేయకముందే ఈపీఎఫ్ఓ రికార్డుల్లో వాటిని సవరించుకోవాలి. చివరగా మీరు సంస్థలో చేరిన తేదీ.. సంస్థ నుంచి బయటికి వచ్చిన తేదీ వంటి వివరాలు కూడా సరిగా నమోదు చేయాలి. వీటిల్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే సదరు సంస్థను సంప్రదించి వివరాలు అప్డేట్ చేసుకోవాలి. ఇలా.. వివరాలన్నీ సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే మీ క్లెయిమ్ ఆమోదం లభిస్తుంది. లేదంటే రిజెక్ట్ అవుతుందని గుర్తుంచుకోవాలి. పీఎఫ్ నగదు విత్ డ్రా కోసం దరఖాస్తు చేసుకునే ముందే ఇవ్వన్నీ చూసుకోండి.