దిగ్గజ ప్రైవేట్ రంగ బ్యాంకు.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 2023-24 ఆర్థిక సంవత్సరం అక్టోబర్- డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి తాజాగా ఫలితాల్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్యూ3 లో నికర లాభం 2.65 శాతం పెరిగి రూ. 17,258 కోట్లుగా నమోదైంది. ఇక అంతకుముందు సెప్టెంబర్ త్రైమాసికంలో నికర లాభం రూ. 16,811 కోట్లుగా ఉంది. ఫలితాల్ని ప్రకటించిన క్రమంలోనే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ శ్రీనివాసన్ వైద్యనాథన్ కీలక ప్రకటన చేశారు. తమ బ్యాంక్ నుంచి మరొక ఐపీఓ వచ్చేందుకు రంగం సిద్ధమైందని చెప్పారు. ఇన్- హౌస్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ అయిన హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపీఓకు వచ్చేందుకు 2025 సెప్టెంబర్ వరకు సమయం ఉందని చెప్పారు శ్రీనివాసన్. త్వరలోనే ఈ ఐపీఓకు సంబంధించి ప్రిపరేషన్ వర్క్ ప్రారంభించనున్నట్లు వివరించారు. ఇక హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్‌లో (హెచ్డీబీఎఫ్ఎస్ఎల్) హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వాటా 94.7 శాతంగా ఉంది.
ఈ కంపెనీ విషయానికి వస్తే.. డిపాజిట్లు మాత్రం స్వీకరించదు. కానీ.. విస్తృతంగా లోన్లు, అసెట్ ఫైనాన్స్ ప్రొడక్ట్స్ ఆఫర్ చేస్తుంటుంది. 2023, డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికానికి గానూ.. ఈ నాన్ బ్యాంకింగ్ కంపెనీ నికర ఆదాయం 23.5 బిలియన్లుగా ఉంది. 2022, డిసెంబర్ 31 సమయంలో ఇది 22.3 బిలియన్లుగా ఉంది. దాదాపు 5 శాతం వృద్ధి కనిపించింది. ఇక టాక్స్ తీసేస్తే ఈ సంస్థ నికర లాభం అంతకుముందు 5 బిలియన్లుగా ఉండగా.. ఇప్పుడు అది 6.4 బిలియన్లకు చేరింది. ఇక్కడ 27.1 శాతం వృద్ధి నమోదైంది. 2023 డిసెంబర్ కల్లా ఈ ప్రైవేట్ రుణ దాతకు దేశవ్యాప్తంగా చూస్తే 8091 బ్రాంచులు ఉన్నాయి. రానున్న ఐదేళ్లలో దీనిని 13 వేలు దాటేలా చూసేందుకు ప్లాన్ చేస్తోంది. వచ్చే సంవత్సరంలోనే దాదాపు 1000 బ్రాంచుల్ని యాడ్ చేసే దిశగా అడుగులు వేస్తోంది.
ఇటీవల అన్‌సెక్యుర్డ్ రుణాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) షాకింగ్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వీటిల్లో రుణాలు తీసుకునే వారి సంఖ్య పెరిగిందని గ్రహించిన కేంద్రబ్యాంకు.. వీటిల్లో రిస్క్ వెయిట్‌ను 100 శాతం నుంచి 125 శాతానికి పెంచింది. దీంతో బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు తమ మూలధనం పెంచుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో లోన్ వడ్డీ రేట్లు పెరిగే అవకాశాలు ఉంటాయి. సరిగ్గా ఇలాంటి సమయంలో ఒక ఎన్బీఎఫ్సీ ఐపీఓపై ప్రకటన చేయడం సాహసం అని చెప్పారు. మరి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఈ నిర్ణయం వెనుక మతలబు ఏంటో తెలియాలంటే కాస్త ఆగాల్సిందే.